TS TET APplication: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)-2024 నోటిఫికేషన్ మార్చి 15న విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్‌ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు.   దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 7075701768, 7075701784 నంబర్లలో సంప్రదించవచ్చు.



టీచర్లకు విద్యాశాఖ అనుమతి తప్పనిసరి.. 
టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. పలువురు టీచర్లు టెట్‌ పరీక్షకు దరఖాస్తుచేయాలని భావిస్తున్నారు. ఇందుకు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలా? లేదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే. ఇలా అనుమతి పొందితేనే సరి.. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. ఈ విషయంపై టెట్‌ కన్వీనర్‌ను మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. టెట్‌ పరీక్షనే కాకుండా.. ఏ పరీక్ష రాయాలన్నా టీచర్లు విద్యాశాఖ నుంచి అనుమతిపొందాలని సూచించారు. టీచర్ల పదోన్నతులు కల్పించేందుకు టెట్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంగా పదోన్నతి పొందాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అయ్యింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థులతో పాటు ఈ సారి సర్కారీ టీచర్లు సైతం పదోన్నతులు పొందేందుకు టెట్‌ రాయబోతున్నారు. గతంలో టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వగా, దీనిని సవరించి ఇటీవలే ప్రభుత్వం టెట్‌ జీవోల్లో మార్పులు చేసింది.


వీరు అర్హులు..


➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. 


➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.


ఫీజుల సంగతేంటి?
అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్‌ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. టెట్ పరీక్ష ఫీజులు భారీగా పెంచడంపై నిరుద్యోగులు, వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం దిగినట్లు తెలుస్తోంది. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గూబ గుయ్యిమనిపించింది.. గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, శిక్షణ, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజలు చెల్లించడం మరింత భారంగా మారిందని, ఇలా చేయడం తగదని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. 2023లో కూడా టెట్‌ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ.400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా భారీగా ఫీజులు పెంచేశారు. 


అందుకే పెంచాల్సి వచ్చింది - అధికారులు
డీఎస్సీ పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ మొదట అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్‌ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫీజుల విషయంలో నిర్ణయం వెలువడినే తర్వాతే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


తెలంగాణ టెట్-2024 సమగ్ర నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..