తెలంగాణలో ఆగస్టు 28న నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 'కీ'ని పోలీసు నియామక మండలి ఆగస్టు 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కీపై ఏమైనా సందేహాలుంటే ఆగస్టు 31న ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కాగా, అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వేర్వేరుగా అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ‘కీ’ కోసం క్లిక్ చేయండి..
ఆన్సర్ కీపై అభ్యంతాలు తెలపడానికి క్లిక్ చేయండి...
అభ్యంతరాలు ఇలా తెలపాలి..
1. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపాలనుకునేవారు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. అక్కడ హోంపేజీలో కనిపించే ''Apply for objections on PWT Preliminary key" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. క్లిక్ చేయగానే అభ్యంతరాలు నమోదుకు సంబంధించిన Login పేజీ ఓపెన్ అవుతోంది.
4. లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
5. తర్వాత అభ్యంతరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది.
6. అక్కడ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, మీడియం, ప్రశ్నపత్రం కోడ్, ప్రశ్న సంఖ్య తదితర వివరాలు నమోదుచేసి, అభ్యంతరానికి సంబంధించిన ఆధారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
7. అన్ని వివరాలు నమోదు చేశాక చివరగా SUBMIT బటన్ మీద క్లిక్ చేయాలి.
అభ్యంతరాల ఆధారంగా పరిశీలన చేసిన తర్వాత తుది కీని అధికారులు విడుదల చేస్తారు. అదే సమయంలో ఫలితాలను కూడా విడుదల చేస్తారు. మరో వారం పదిరోజుల్లో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 28న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. హైదరాబాద్‌తో రాష్ట్రవ్యాప్తంగా 38 పట్టణాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారం.. అన్ని నియమ నిబంధనల మేరకు.. సజావుగా నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు, వేలిముద్రల సేకరణ, డిజిటల్ విధానంలో ఫొటోలు సేకరించారు.
పోలీస్ సివిల్ విభాగంలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 91.34శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో (97.41 %) హాజరు నమోదుకాగా.. అత్యల్పముగా సత్తుపల్లి జిల్లాలో (83.30 %) నమోదైంది.
అర్హత మార్కులు కుదింపు:
కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో ఈసారి కనీస అర్హత మార్కుల్ని కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణిస్తారు. రాతపరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 5 తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులే తర్వాత దశలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరువుతారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు అర్హత సాధిస్తారు. తుది పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...