తెలంగాణలో 840 జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 111 మైనారిటీ రెసిడెన్షియల్ (టీఎంఆర్) జూనియర్ కాలేజీల్లో జేఎల్ పోస్టులను భర్తీ చేయనుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనుంది. అలాగే 12 టీఎంఆర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదల చేసింది. 


ఈ నియామకాలన్నీ కాంట్రాక్టు ప్రాతిపదికన జరుగుతాయని మార్గదర్శకాల్లో పేర్కొంది. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లేదా సాధారణ జూనియర్ లెక్చరర్ల బదిలీ ద్వారా నియామకాలు జరిగినప్పుడు వీరి సేవలు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలను పాఠశాలల నుండి జూనియర్ కళాశాలలుగా అప్‌ గ్రేడ్ చేసింది. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది. 


DMWO కార్యాలయాల ద్వారా.. 
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయాలలో (DMWO) ఈ దరఖాస్తులు లభిస్తాయి. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.27,000 వేతనం అందిస్తారు. 


సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు.. 
తెలుగు- 111
ఇంగ్లీష్- 111
ఉర్దూ- 111
గణితం- 80
భౌతిక శాస్త్రం- 63
కెమిస్ట్రీ- 63
వృక్ష శాస్త్రం- 63
జంతు శాస్త్రం- 63
అర్థ శాస్త్రం- 48
పౌర శాస్త్రం- 48
వాణిజ్యం- 48
చరిత్ర- 31
ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల ఖాళీలు- 85


విద్యార్హత వివరాలు.. 
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్) పూర్తి చేసిన లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ మెథడాలజీతో ఎన్‌సీటీఈ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. 


ఏదైనా గుర్తింపు పొందిన సీనియర్ సెకండరీ స్కూల్ లేదా జూనియర్ కాలేజీల్లో XI నుంచి XII లేదా ఇంటర్మీడియట్ వారికి కనీసం మూడేళ్ల పాటు బోధించిన అనుభవం ఉండాలి. ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ఏదైనా గుర్తింపు పొందిన ఒకేషనల్ జూనియర్ కళాశాలలో XI నుండి XII తరగతులకు కనీసం మూడేళ్ల పాటు బోధించిన అనుభ‌వం ఉండాలి.


పరీక్ష ఎప్పుడంటే?
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపిక ఆగస్టు 16వ తేదీన ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట రాత పరీక్ష ఉంటుంది. ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఆగస్టు 6వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. రాత ప‌రీక్షకు 100 మార్కులు.. ఇంట‌ర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు.