TGPSC Group -1 Selected List: తెలంగాణలో వివాదాలకు కేంద్రంగా మారిన గ్రూప్‌ -1 ఫలితాలను అర్థరాత్రి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఉదయం కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు రావడంతోనే మరోసారి న్యాయవివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు రాత్రికి రాత్రే ఎంపిక జాబితాను వెల్లడించింది. తుది ఎంపిక మాత్రం కోర్టుతీర్పునకు లోబడే ఉంటుందని స్పష్టం చేసింది.  

Continues below advertisement

తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, ఇందులో 562 పోస్టులకు అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. న్యాయ వివాదాలు, హైకోర్టు ఉత్తర్వులతో ఉత్కంఠగా మారిన ఈ నియామక ప్రక్రియ, చివరికి హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయడంతో, ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలోనే కమిషన్ ఈ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది. అయితే, తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

బుధవారం హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో బోర్డు సమావేశమైంది. ఎంతో కాలంగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. అర్ధరాత్రి వరకు అవిశ్రాంతంగా కసరత్తు చేసి, తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఈ నియామకాల వివరాలను కమిషన్ వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో ఒక పోస్టును న్యాయవివాదం నేపథ్యంలో 'విత్‌హెల్డ్'లో ఉంచినట్లు చైర్మన్ వివరించారు.

Continues below advertisement

ఈ తుది ఎంపిక ప్రక్రియలో మల్టీజోన్-1 లో 258 పోస్టులకు, మల్టీజోన్-2 లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కమిషన్ ఒక కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడైతే, వారి నియామకాలను ఏ క్షణమైనా రద్దు చేయడంతోపాటు, టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

వైద్యురాలే రాష్ట్ర టాపర్: ప్రతిభకు పట్టం

ఈ గ్రూప్-1 ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రాష్ట్ర టాపర్‌గా ఒక వైద్య విద్యార్థిని నిలవడం. హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన లక్ష్మీ దీపిక, మల్టీజోన్-2 కేటగిరీలో రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. ఆమె గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు గాను ఏకంగా 550 మార్కులు సాధించి అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తిచేసిన ఆమె, తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయం. తుది ఎంపికలో లక్ష్మీ దీపిక ఆర్డీవో  పోస్టును దక్కించుకున్నారు. టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు అందరూ ఆర్డీవో పోస్టులనే ఎంచుకున్నారు. 

టాప్-3లో ప్రతిభావంతులు

రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకును నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ సాధించారు. ఆయన 535.5 మార్కులతో ఆర్డీవో పోస్టును దక్కించుకున్నారు. మల్టీజోన్-1 కేటగిరీలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థిని హనుమకొండ జిల్లాకు చెందిన జిన్నా తేజస్విని. రాతపరీక్షల్లో 532 మార్కులు సాధించిన తేజస్విని, ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె అనుభవం, పట్టుదల కలగలిపి తాజాగా తుది ఎంపికలో ఆర్డీవో పోస్టును సాధించడానికి దోహదపడ్డాయి. టాప్ 10 ర్యాంకుల జాబితాలో లక్ష్మీ దీపిక (1), దాడి వెంకటరమణ (2), వంశీకృష్ణారెడ్డి (3), జిన్నా తేజస్విని (4), సిదాల కృతిక (5), హర్షవర్ధన్ (6), కె. అనూష (7), ఏరెండ్ల నిఖిత (8), కె. భవ్య (9), శ్రీకృష్ణసాయి (10) ఉన్నారు.

ఈ గ్రూప్-1 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాను పరిశీలిస్తే, మహిళా సాధికారత స్పష్టంగా కనిపిస్తోంది. తొలి 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. కేవలం టాప్-50 ర్యాంకుల్లో 25 మంది మహిళా అభ్యర్థులు స్థానం సంపాదించుకున్నారు, అలాగే, వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ప్రతిభ చాటారు.

ప్రధాన పరీక్షల్లో (అర్హత పరీక్ష ఇంగ్లిష్ మినహా) 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య 52 మందిగా ఉంది. ప్రతిభ కేవలం తెలంగాణ స్థానికులకే పరిమితం కాలేదు. టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు (నాన్-లోకల్స్) చోటు దక్కించుకున్నారు. వీరిలో టాప్-3 ర్యాంకర్ కూడా స్థానికేతర అభ్యర్థి కావడం ఈ పరీక్షల పారదర్శకతకు నిదర్శనం.

కొత్త సంస్కరణలతో పారదర్శక నియామకం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నియామకాల్లో టీజీపీఎస్సీ కొత్త సంస్కరణలను అమలు చేసింది. ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించింది. మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి కమిషన్ చర్యలు తీసుకుంది.

ఈ నియామక ప్రక్రియలో కీలకమైన ఘట్టం ధ్రువీకరణ పత్రాల పరిశీలన. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను కమిషన్ చేపట్టింది. ఈ పరిశీలన సమయంలోనే అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ఆప్షన్లను తీసుకున్నారు. ఆ ఆప్షన్ల ఆధారంగానే టీజీపీఎస్సీ తుది ఎంపికలను పూర్తి చేసింది.

గ్రూప్-1 నియామక ప్రయాణం

టీజీపీఎస్సీ మొత్తం 563 పోస్టులకు 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మెయిన్స్ 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. ప్రధాన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులను 2024 మార్చి 30న ప్రకటించారు. మొత్తం 21,085 మంది అభ్యర్థులు అన్ని పేపర్లకు హాజరైనట్లు కమిషన్ తెలిపింది.

ఈ నియామక ప్రక్రియలో మధ్యలో న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తరువాత, జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా మరోసారి పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కమిషన్ అప్పీలు చేయగా, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసింది. దీంతో ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయింది.

ఈ తుది ఎంపిక జాబితా న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందనే విషయాన్ని టీజీపీఎస్సీ మరోసారి నొక్కి చెప్పింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.