TGPSC Group3 Answer Key: తెలంగాణలో గ్రూప్-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన పేపర్-1, పేపర్-2, పేపర్-3 రాతపరీక్షల ఆన్సర్ కీలను టీజీపీఎస్సీ (TGPSC) జనవరి 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, తమ గ్రూప్-3 హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి సమాధానాలు సరిచూసుకోవచ్చు. ఆన్సర్ కీలు జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. అభ్యర్థులు జనవరి 8 నుంచి జనవరి 12న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.
గ్రూప్-3 ఆన్సర్ కీ అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ 1365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా 13 పోస్టులు జతచేయడంతో.. మొత్తం ఖాళీల సంఖ్య 1388కి చేరింది. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో 2024, నవంబర్ 17,18 తేదీల్లో పేపర్-1, పేపర్-2, పేపర్-3 పరీక్షలను కమిషన్ విజయవంతంగా నిర్వహించింది. నవంబర్ 17న జరిగిన గ్రూప్-3 పేపర్-1 పరీక్షకు 2,73,847 (51.1%) మంది హాజరయ్యారు. పేపర్-2కు 2,72,173 (50.7%) మంది మాత్రమే హాజరయ్యారు. అంటే తొలిరోజు మొత్తం కలిపి 50.70 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది. ఇక నవంబరు 18న నిర్వహించిన పేపర్-3 పరీక్షకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
పరీక్షా విధానం..
గ్రూప్-3 పరీక్షలో మెుత్తం మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. అలా మూడు పేపర్లకు కలిపి మొత్తం 450 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్ రాసేందుకు రెండన్నర గంటల సమయం కేటాయించారు. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. ఇక పరీక్షలు మూడు భాషల్లో నిర్వహించారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయి. గ్రూప్-3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు కొలువు సాధిస్తారు. మూడు పేపర్లలోనూ జనరల్ నాల్జెడ్, భారత రాజ్యాంగం, భారత చరిత్ర, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
రెండ్రోజుల్లో గ్రూప్ -2 ‘కీ’..
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాతపరీక్షల ఆన్సర్ కీలు రెండురోజుల్లో విడుదల కానుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. జనవరి 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని, ఉద్యోగ పరీక్షల విధానాలపై ఆ సదస్సులో చర్చించనున్నట్టు ఛైర్మన్ తెలిపారు.
* గ్రూప్-3 పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 1388
1) జూనియర్ అసిస్టెంట్: 680 పోస్టులు
2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు
3) ఆడిటర్: 126 పోస్టులు
4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు
5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు
6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు
7) అకౌంటెంట్: 01 పోస్టు