తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష తేదీలను తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. భారీగా దరఖాస్తులు వచ్చాయి. అందులో స్క్రూట్నీ చేసేందుకు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు రకాల నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం... రెండు రకాల పరీక్షలు పెడుతోంది. ఎస్సై, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లకు వేర్వేరుగా పరీక్షలు పెడుతోంది.

  


పోలీసు నియామక పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. ఎస్సై నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్న 554 పోస్టులకు ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. దీనికి హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని 20 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.


కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న 15, 644 ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్షను ఆగస్టు 21న నిర్వహిస్తారు. ఇది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. ఈ రాత పరీక్ష కోసం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా 40 పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కూడా దీంట్లోనే కలిపేశారు. 






ఎస్సై ఉద్యోగాల కోసం రెండు లక్షల 45వేల మంది అప్లై చేసుకొని ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 6 లక్షల 50 వేల మంది అప్లై చేసుకున్నారు. 


ఎస్సై పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా జులై 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ పరీక్ష కోసం హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 


ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్‌ బట్టి చూస్తే ఎస్సై ఉద్యోగానికి నాలుగు వందల మందికిపైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే సరికి ఒక పోస్టుకు నలభై మందికిపైగా పోటీ పడుతున్నారు. ఇప్పుడు నిర్వహించే ప్రాథమిక పరీక్షలో చాలా మందిని స్క్రూట్నీ చేస్తారు. టాప్‌లో ఉన్న వారిని ఫిజికల్‌ టెస్టులకు పిలుస్తారు. అందులో మెరిట్ సాధించిన వాళ్లను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.