TGPSC Group1 Answer Key: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు 17 వరకు అవకాశం

Group1 Answer Key: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీని టీజీపీఎస్సీ జూన్ 13న విడుదల చేసింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 17 వరకు తెలియజేయవచ్చు.

Continues below advertisement

Group1 Prelims Answer Key: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ని 'కీ'ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) జూన్‌ 13న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలను) కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు జూన్‌ 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానాల్లో తెలిపే వాటిని పరిగణలోకి తీసుకోరు. 

Continues below advertisement

ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకీ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు జూన్ 9న OMR విధానంలో రాతపరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసి పరీక్ష నిర్వహించారు. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 3.02 లక్షల మంది మాత్రమే (74 శాతం) ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీతోపాటు ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేయనున్నారు.   

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు విడుదల..
ఇదిలా ఉండగా.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలును టీజీపీఎస్సీ జూన్ 12న ప్రకటించింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 21న జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్), అక్టోబరు 22న పేపర్-1(జనరల్ ఎస్సే), అక్టోబరు 23న పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ), అక్టోబరు 24న పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్), అక్టోబరు 25న పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్), అక్టోబరు 26న పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), అక్టోబరు 27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ) పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఇలా..
మొత్తం 900 మార్కులకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్ష (ఈ మార్కులను లెక్కించరు) మాత్రమే పరిగణిస్తారు. ఇక మిగతా ఆరు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు.  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్‌ పరీక్షలకు ముందుగా ఎంపిక చేసుకున్న భాషలోనే అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఒక పేపర్‌ తెలుగులో, మరో పేపర్‌ ఇంగ్లిష్‌ లేదా ఉర్దూలో రాసిన జవాబు పత్రాలను పరిగణనలోకీ తీసుకోబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola