Telangana Police Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కొలువుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలనా నియంత్రణలో ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ జూన్ 27, 2026న జీవో నెంబర్ 78 జారీ చేసింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడానికి, పోలీస్ శాఖలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. శాఖలోని కార్యకరాలాపాలు, అవసరాలు, ఆర్థిక సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని, నేరుగా నియామక ప్రక్రియ ద్వారా ఈ ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
మొత్తం ఐదు వేల పోస్టుల్లో సివిల్ పోలీస్ విభాగం నుంచి టెక్నికల్ విభాగం వరకు వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి పోస్టు
- సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(సివిల్)- 148 పోస్టులు
- సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఆర్)- 14 పోస్టులు
- రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(టీజీఎస్పీ)- 12 పోస్టులు
- సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)-3 పోస్టులు
- అసిస్టెం్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎఫ్‌పీబీ)-23 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ స్థాయి పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్(సివిల్) - 3,697 ఉద్యోగాలు
- పోలీస్ కానిస్టేబుల్(AR)-1,052 పోస్టులు
- కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)-24 పోస్టులు
- కానిస్టేబుల్(డ్రైవర్)- పీటీవో 20 పోస్టులు
- కానిస్టేబుల్(మెకానిక్)- పీటీవో- 7పోస్టులు
నోటిఫికేషన్ ఎప్పుడు?
ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నియామక ప్రక్రియ వేగవంతం కానుంది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తక్షణమే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ ,షెడ్యూల్ విడుదల చేయనుంది.
నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఈ నియామకాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నిర్వహిస్తారు. హోంశాఖ ప్రిన్సిప్ సెక్రటరీ, డీజీపీ ద్వారా స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు వంటి పూర్తి వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సేకరిస్తుంది. బోర్డు త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
