Agra Bathroom Murder Case: నేరం ఎప్పుడూ దాగదు అని పెద్దలు ఊరకే అనలేదు. ఎంతటి తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు, అదే అతడిని చట్టానికి చిక్కేలా చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ కూడా భర్తను హత్య చేసి తప్పించకోవాలని చూసింది. కానీ ఆమె చేసిన తప్పు చట్టానికి పట్టించింది. కాబోయే భర్తను హత్యచేసిన సియా ఘటనపై చర్చ జరుగుతున్న టైంలో ఆగ్రా దుర్ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఆగ్రాకు చెందిన సురేంద్ర శర్మ అనే వ్యక్తి 45 రోజుల నుంచి కనిపించడం లేదు. తన భర్త కనిపించడం లేదని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రోజులు గడుస్తున్నా తన భర్త కనిపించడం లేదని బోరుమని శోకాలు పెట్టింది. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని విచారించారు. 45 రోజుల తర్వాత కేసును ఛేదించారు. భార్యే తన భర్తను చంపేసిందని తేల్చారు. బాత్‌రూమ్‌లో పూడ్చిన సురేంద్ర శర్మ డెడ్‌బాడీని వెలికి తీశారు.
కేసును ఎలా ఛేదించారు?
ఈ కేసును విచారిస్తున్న టైంలో సురేంద్ర శర్మ సోదరుడి చెప్పిన స్టేట్మెంట్ కీలక మలుపు తిప్పింది. సురేంద్ర శర్మ భార్యపైనే అతను అనుమానం వ్యక్తం చేశారు. అంతే అప్పటి నుంచి ఆమె విచారించడం మొదలు పెట్టారు. అప్పటి వరకు దర్యాప్తుకు హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూనే పోలీసులను తెలివిగా తప్పు దాటి పట్టించింది. కొన్ని రోజుల తర్వాత పోలీసులు స్టైల్ మార్చి ప్రశ్నించారు. అంతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సురేంద్ర శర్మ అదృశ్యమైనట్లు 45 రోజుల క్రితమే రిపోర్ట్ అయ్యింది. ఈ హత్య అప్పుడే జరిగి ఉంటుందని తేలింది. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం రూబీ ప్రవర్తన. నేరం చేసిన తర్వాత ఆమె ఏమాత్రం భయపడకుండా, భర్త కోసం వెతుకుతున్నట్లు పోలీసులతో కలిసి తిరిగింది. ఇరుగుపొరుగు వారు తనను అనుమానించకుండా ఉండేందుకు వారి ముందు ఏడ్చేది. భర్తను కిరాతకంగా చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్‌లో గొయ్యి తవ్వు పూడ్చి పెట్టేసింది. దానిపై ఫ్లోరింగ్ వేసింది. పోలీసులు కేసును ఛేదించి ఫ్లోరింగ్ తీసి డెడ్‌బాడీని రికవరీ చేసుకున్నారు. ఒక మనిషిని చంపి, అదే ఇంట్లో శవంపై నడుస్తూ ఇన్ని రోజులు గడపడం ఆమెలోని నేరపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోంది.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి పంపారు. నిందితురాలు రూబీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కట్టుకున్న భార్యే కాలయముడిలా మారడం కుటుంబ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నేరం ఎంత చాకచక్యంగా చేసినా, చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఈ కేసు 2025 ఫిబ్రవరిలో జరిగిన బ్లూ డ్రమ్ మర్డర్ కేసును గుర్తుకు తెస్తోంది. అప్పట్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రాజ్‌పుత్ తన ప్రియుడితో కలిసి చంపి, శరీర భాగాలను కోసి ఒక నీలం రంగు డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో సీల్ చేసింది. ఇప్పుడు ఆగ్రాలో జరిగిన ఈ బాత్‌రూమ్ హత్య కూడా అదే తరహాలో అత్యంత క్రూరంగా, పక్కా ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోంది.
