Staff Nurse Final Result: తెలంగాణలో స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తుది జాబితాను రాష్ట్ర వైద్యారోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB) ఆదివారం (జనవరి 28) వెల్లడించింది. వైద్యారోగ్యశాఖలో మొత్తం 9 విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను ప్రకటించింది. వైద్య విద్య డైరెక్టరేట్(DME) పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్ నర్సు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో తుది ఎంపిక ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఎంపిక ఫలితాలతోపాటు కటాఫ్ మార్కులు, ఫైనల్ మెరిట్ జాబితాను కూడా MHSRB విడుదల చేసింది.


రాష్ట్రంలో మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్సర్ 'కీ' అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను డిసెంబరు 18న MHSRB విడుదల చేసింది. ధ్రవపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను జనవరి 28న విడుదల చేసింది.


తుది ఎంపిక ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ వైద్యారోగ్యశాఖలో కీలక విభాగాల్లో నియామకాల ప్రక్రియను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, గురుకుల పాఠశాలలు సహా వివిధ వైద్య విభాగాల్లో 5,204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి గతేడాది జనవరిలో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,996 మంది ఏఎన్‌ఎంల నియామకానికి ఆగస్టులో ప్రకటన వెలువడగా దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. దరఖాస్తులు భారీగా వచ్చాయి. నవంబరు 10న రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారమూ బోర్డు నుంచి వెలువడకపోవడంతో దరఖాస్తుదారులంతా ఆందోళన చెందుతున్నారు. ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియకు ఆగస్టులో ప్రకటన వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. తదుపరి నియామక ప్రక్రియ నిల్చిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరగా ఆయా పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.


గత ప్రభుత్వం నర్సింగ్ సిబ్బందికి హోదా మార్పు చేసిన సంగతి తెలిసిందే. స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్‌నర్స్‌ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్పులు చేసింది. వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పబ్లిక్ హెల్త్ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో మార్పు చేయలేదు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...