TG Group 2 Results: హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. తెలంగాణలో గ్రూప్‌-2 ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) ఆదివారం విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఒక్క పోస్ట్ మినహా 782 మంది జాబితాను వెల్లడించింది. ఒక్క పోస్టు ఫలితాన్ని టీజీపీఎస్సీ పెండింగ్‌లో పెట్టింది. 2022లో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలైంది. అభ్యర్థులు డిమాండ్ చేయడంతో పరీక్షను వాయిదా వేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం మారింది.

మార్చిలో జనరల్ ర్యాంకులు, నేడు తుది ఫలితాలు

కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షల తేదీలు ప్రకటించి, 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. 2025 మార్చి 11న గ్రూప్ 2 పోస్టులకుగానూ జనరల్‌ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. అనంతరం షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సైతం టీజీపీఎస్సీ పూర్తి చేసింది. దసరా పండుగ నాటికి శుభవార్త అందించాలని భావించిన కమిషన్ గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు దసరా కానుకగా గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది.

గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి   View Pdf

 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులకు 2024 డిసెంబర్ 15, 16 తేదీలలో రాత పరీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 అభ్యర్థుల మార్కులను, జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ మార్చి నెలలో ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. అంతా పరిశీలించాక మెరిట్ ప్రకారం రిజర్వేషన్ల ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది టీజీపీఎస్సీ.

గ్రూప్ 2లో ఏ పోస్టులు ఉంటాయంటే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒకసారి గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేశారు. తరువాత మరోసారి గ్రూప్ 2 నిర్వహించినా పేపర్ల లీకులతో పలు ఎగ్జామ్స్ తో పాటు ఈ పరీక్షల ఫలితాలు రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీలో ప్రక్షాళన చేసింది. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల తరువాత జనరల్ ర్యాంకింగ్స్ సైతం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పరీక్ష నిర్వహించి మార్చి 11న మార్కుల వివరాలు, జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. గ్రూప్ 2 పరీక్ష ద్వారా మున్సిపల్ కమిషనర్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏసీటీవో, తహసిల్దార్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.