TSPSC Group-1 Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు అదనంగా మ‌రో 60 పోస్టులను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరినట్లయింది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ వెలువడనుంది. గ‌తంలో 503 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్టుల‌కు అద‌నంగా ఈ 60 పోస్టుల‌ను క‌లుపుతూ వీలైనంత త్వర‌గా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ గ‌తేడాది జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ ప‌రీక్షను ర‌ద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా కొత్త‌గా 60 పోస్టుల‌ను మంజూరు చేయ‌డంతో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ మ‌ళ్లీ నిర్వహించే అవ‌కాశం ఉంది.


తెలంగాణ ఏర్పడిన తర్వాత  తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు.


రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల ఆధారంగా..
2011లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఆ నియామకాలు 2018లో పూర్తయ్యాయి. తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్‌పీఎస్సీ రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్-1 నుంచి కిందిస్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న విషయమై ఇప్పటికే నియామక సంస్థల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది.





టీఎస్‌పీఎస్సీ కొత్త కార్యదర్శిగా నవీన్ నికోలస్‌..
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న ఆయన బాధ్యతలు స్వీకరించారు. నికోలస్ గతంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...