New DSC Notification in Telangana Soon: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోంది. డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్‌ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డీఎస్సీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా.. విద్యార్థులు లేరు.. 
కొత్త డీఎస్సీ కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. పాఠశాలల సంఖ్య, అందులోని విద్యార్థులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన డీఎస్సీ ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. కాగా, పాఠశాలల్లో ఖాళీలు ఉన్నా.. వాటిని భర్తీ చేయడంలో సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య యేటా పడిపోతోంది. దాంతో చాలాచోట్ల టీచర్ పోస్టులున్నా.. అందుకుతగ్గట్లుగా విద్యార్థులు లేరు. ఇలాంటి సందర్భంలో క్రమబద్ధీకరణను అమలు చేయాలి. ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం జరగడం లేదు. ఈ పనిచేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే ప్రయోజనం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.


ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తులు అంగా... మొత్తం 2,45,263 మంది (87.61 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలకు 34,694 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5 నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ యోచనగా ఉంది.


సీఎం నివాసానికి తరలివచ్చిన డీఎస్సీ-2008 బాధితులు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ 2008-డీఎస్సీ బాధితులు ఆగస్టు 26న సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తరలివచ్చారు. డీఎస్సీ-2008 సాధన సమితి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 200 మందికిపైగా అభ్యర్థులు వచ్చారు. కాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆరుగురు ప్రతినిధుల బృందాన్ని సీఎం నివాసంలోకి అనుమతించారు. తమకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఫిబ్రవరి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వారు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డికి తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి నివేదిక తీసుకొని.. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సీఎం కార్యాలయ అధికారులు హామీ ఇచ్చారని డీఎస్సీ-2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..