Telangana employees will get extra pay if they work overtime: తెలంగాణలో ప్రైవేటు సంస్థల ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పులు వచ్చాయి. రోజుకు పది గంటల వరకూ పని చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని గంటలు 48 గంటలకు మించరాదని స్పష్టం చేసింది. అధికంగా పని చేస్తే.. ఆ సమయానికి అదనపు వేతనం పొందడానికి అర్హులని తెలిపింది. అలాగో రోజులో ఆరు గంటల డ్యూటీలో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని .. విశ్రాంతితో కలిపి ఎలాంటి సందర్భాల్లో అయినా 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
పదిగంటల పాటు పని చేసుకునే అవకాశం
ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఇలాంటి నిర్ణయమే కొద్ది రోజుల కిందట ఏపీ ప్రభుత్వం తీసుకుంది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థలు, వివిధ కంపెనీలు, షాపుల్లో పని చేసే ఉద్యోగులు 10గంటలు పని చేయవచ్చని తెలిపారు. ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం ప్రస్తుతం కార్మికుల పనిగంటలు అర్ధగంట భోజన విరామంతో కలిపి 9 గంటలు మాత్రమే ఉంది. కార్మికులకు ప్రతి 5 పని గంటలకు ఓ అర్ధగంట విరామం ఉంటుంది. ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి ఆరుగంటలకు అర్ధగంట విరామం ఇస్తారు. తెలంగాణలోనూ ఇదే అఏమలు చేస్తున్నారు.
ఎక్కువగా పని చేస్తే అదనపు వేతనం చెల్లింపు - ఏపీలోనూ ఇంతకు ముందే నిర్ణయం
గతంలో క్వార్టర్‌కు 50 నుంచి 75 గంటల వరకు ఓవర్ టైమ్ ఓటీ అవకాశం ఉండగా తాజాగా దానిని 144 గంటలు వరకూ పెంచారు. ప్రస్తుతం 8 గంటలు దాటి పనిచేస్తే ఓవర్‌టైంగా పరిగణిస్తున్నారు. తాజా సవరణల్లో 10 గంటలు దాటిన పనిని ఓవర్‌టైంగా పరిగణిస్తారు. అయితే, వారానికి 48 పనిగంటల పరిమితిలో మార్పు లేదు. వారం మొత్తం మీద సాధారణ పనిగంటలు 48 మాత్రమే. అంత కంటే పని చేయించుకుంటే ఓటీ చెల్లించాల్సి ఉంటుంది.
పని సమయాన్ని పెంచలేదు.. మార్పులే !
అయితే చాలా మంది ప్రభుత్వం ఎనిమిది గంటల పని సమయాన్ని మార్చిందని... అదనంగా రెండు గంటలు పని చేసుకునేలా అవకాశాన్ని కల్పించిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఉత్తర్వులు అలాంటివి కాదు. పని వేళలను కంపెనీలు కోరుకున్నట్లుగా మార్చారు. రోజుకు పది గంటల సేపు కార్మికుల ఆమోదంతోనే పని చేయించుకోవచ్చు. అదనంగా పని చేసినంత వరకూ వారికి ఓీట చెల్లిస్తారు. వారం మొత్తం మీద చేయించుకోవాల్సిన పని గంటలపైనా స్పష్టత ఉండటంతో.. ఈ విషయంలో కార్మికులకు జరిగే నష్టం ఏమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి.