మన దేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పొందింది. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్‌ఇన్ భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితాను వెలువరించింది. ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్-ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. గతేడాది జాబితాలో టెక్ కంపెనీలు ఆధిపత్యం ప్రదర్శించగా.. ఈసారి ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్, నిపుణుల సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలు జాబితాలో ఎక్కువగా చోటు సాధించాయి. 


జాబితాలోని అంశాలివే!
అగ్రగామి 25 కంపెనీల్లో 10 కంపెనీలు ఆర్థిక సేవలు/బ్యాంకింగ్/ఫిన్ టెక్ రంగాలకు చెందినవే ఉన్నాయి. మెక్వారీ గ్రూప్ (5వ స్థానం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (11), మాస్టర్ కార్డ్(12), యుబీ (14) స్థానాల్లో ఉన్నాయి. ఇ-స్పోర్ట్స్, గేమింగ్ రంగాల కంపెనీలు తొలిసారిగా ఈ జాబితాలో చోటు పొందాయి. డ్రీమ్ 11 సంస్థ 20వ స్థానంలో, గేమ్స్ 24+7 సంస్థ 24వ స్థానంలో నిలిచింది.


జాబితాలోని 25 కంపెనీల్లో 17 తొలిసారి చోటు దక్కించుకున్నవే కావడం గమనార్హం. భారత వ్యాపార వ్యవస్థ జోరు కొనసాగించడాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది లింక్డ్‌ఇన్ అగ్రగామి అంకుర సంస్థల జాబితాలో ఉన్న జెప్టో.. తాజా జాబితాలో 16వ స్థానం పొందింది. రాణించే సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, కంపెనీ స్థిరత్వం, విదేశీ అవకాశాలు, కంపెనీ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి అంశాల ఆధారంగా, కంపెనీలకు ఈ జాబితాలో లింక్డ్‌ఇన్ చోటు కల్పించింది.


కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కంప్యూటర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని చేర్చుకునేందుకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో భవిష్యత్ వృద్ధి, దీర్ఘకాల విజయాలు ఇచ్చే కంపెనీల కోసం నిపుణులు చూస్తున్నారు. ఉద్యోగావకాశాలకు వెతుక్కునేందుకు వీలుగా ఈ జాబితా వెలువరించామ‌ని లింక్డ్‌ఇన్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ నిరాజిత బెనర్జీ తెలిపారు. ఈ జాబితాలోని కంపెనీల్లో అత్యధికం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ముంబయి, హైదరాబాద్, దిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నియామకాలు కూడా ఈ నగరాల్లోనే అధికంగా జరుగుతున్నాయి.


జాబితాలో చోటు సంపాదించిన అగ్రగామి సంస్థలివే..
ఈ జాబితాలో టెక్ దిగ్గజం టీసీఎస్ అగ్రస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో అమెజాన్ సంస్థ కొనసాగుతోంది. ఇక తర్వాతి స్థానాల్లో మోర్గాన్ స్టాన్లీ (3వ స్థానం), రిలయన్స్ ఇండస్ట్రీస్ (4వ స్థానం), మెక్వారీ గ్రూప్ (5వ స్థానం), డెలాయిట్ (6వ స్థానం), ఎన్‌ఏవీ ఫండ్ (7వ స్థానం), ష్నైడర్ ఎలక్ట్రిక్ (8వ స్థానం), వయాట్రిస్ (9వ స్థానం), రాయల్ కరేబియన్ (10వ స్థానం) సంస్థలు నిలిచాయి.


ఇదీ చదవండి..


ఇంటర్‌ చదివినా ఆపిల్‌లో ఉద్యోగం, రెండేళ్లలో లక్ష జాబ్స్‌, మహిళలకే తొలి ప్రాధాన్యం
అమెరికన్‌ కంపెనీ, ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ (Apple iPhone), మన దేశంలో గత రెండు సంవత్సరాల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఆ ఉద్యోగాల్లో మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది, ఉద్యోగుల్లో 72 శాతం మందిని మహిళలనే తీసుకుంది. అంటే.. గత రెండు సంవత్సరాల్లో, ఇండియాలో ఆపిల్‌ ఉద్యోగాల్లోకి తీసుకున్నవాళ్లలో, ప్రతి 100 మందిలో 72 మంది మహిళలే. ఈ ఉద్యోగాలన్నీ తయారీ విభాగంలో (manufacturing) సృష్టించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...