TS DSC Supplementary Notification: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలో శుభవార్త వెల్లడించనుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగంలో ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించిన నేపథ్యంలో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండగా.. తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలు సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 4,281 పోస్టులకు కోత పడినట్లయింది. మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా.. ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్‌లో 70 శాతం, హెడ్‌మాస్టర్ పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది.
గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతుల ద్వారా 1947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 2162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు స్పష్టంచేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపినా మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండిపడింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తోపాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అనుబంధ నోటిఫికేషన్ యోచనలో..
రాష్ట్రంలో 5,089 పోస్టులతో విడుదలైన గత డీఎస్సీ నోటిఫికేషన్‌కు మొత్తం 1.77 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా నియామక పరీక్షలు ఆగిపోయాయి. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా.. పోస్టులను పెంచి, అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు మరింత ఆలస్యంకావచ్చు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ALSO READ:
ఏపీ దేవాదాయ శాఖలో 70 ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - అర్హతలివే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 40 ఏఈఈ పోస్టులు, 35 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఏపీకి చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..