తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందేందుకు సీనియారిటీ జాబితాను జనవరి 27న సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓలు) ప్రకటించనున్నారు. విద్యాశాఖ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలపై జనవరి 26న జీఓ జారీచేశారు. ఇటీవల జరిగిన డీఈఓల సమావేశంలో ఇచ్చిన కాలపట్టిక, మార్గదర్శకాల్లోని అంశాలే జీఓలో ఉన్నాయి. బదిలీల కోసం జనవరి 28 నుంచి మూడ్రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 2015 జులైలో చివరిసారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి జరపగా...మళ్లీ ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2018లో బదిలీలు మాత్రమే చేశారు. ఈసారి మొత్తం 9,700 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మరో 30 వేల మంది బదిలీ కానున్నారు. మొత్తం 37 రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నియమించారు.
తెలంగాణలో జనవరి 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జనవరి 26న ఉత్తర్వులు (జీవో నంబర్ 5) జారీ చేసిన సంగతి తెలిసిందే. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. జనవరి 27న కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. జనవరి 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించునున్నారు. ఉపాధ్యాయులు తమ దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్ఈవోలకు హార్డ్‌కాపీలను సమర్పించాలి. ఇక మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు సమర్పించాలి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2లోపు ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంటుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరించనున్నారు.
ప్రధానోపాధ్యాయుల ఖాళీలివి...
➥మల్టీ జోన్-1లోని 19 జిల్లాల్లో 2,420 మంది ప్రధానోపాధ్యాయులు ఉండాలి. అందులో 1096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
➥మల్టీ జోన్-2లో 14 జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల మంజూరు పోస్టులు 1966 ఉండగా.. అందులో 906 ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయనున్నారు.
317 జీఓ ఉపాధ్యాయులకు నిరాశే..
గతేడాది జనవరిలో 317 జీఓ ద్వారా కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించారు. ఆ క్రమంలో దాదాపు 25 వేల మంది ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీకి కనీస స్టేషన్ సర్వీస్ రెండేళ్లు కాకుండా జీరో సర్వీస్‌తో 317 జీఓ బాధితులకు కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించాలని పలు సంఘాలు విద్యాశాఖకు విన్నవించినా పట్టించుకోలేదు. దాంతో ఇప్పటివరకు ఉన్న ఆశ ఆ ఉపాధ్యాయుల్లో ఆవిరైపోయింది. అందరికీ అవకాశం ఇస్తే మారుమూల పాఠశాలల్లో పనిచేసే వారు ఉండరని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు పనిచేసే చోటే ఉంటారని, ఆ తర్వాత టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్‌టీ) ద్వారా కొత్త ఉపాధ్యాయులు వస్తారు కదా అని చెప్పినా ప్రభుత్వం తిరస్కరించింది. దీన్ని బట్టి టీఆర్‌టీ ప్రకటన ఇప్పట్లో రాకపోవచ్చని అంటున్నారు.
ఉపాధ్యాయ దంపతులకు గుడ్ న్యూస్..
ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విషయంలో గత కొంత కాలంగా ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీచర్ దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయాలని ఇటీవల ఉపాధ్యాయులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను ట్రాన్స్ ఫర్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.