Pune labour commissioner issues summons TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై 'అక్రమ డిస్మిసల్' , 'అనధికారిక లేఅవుట్స్' ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పూణే లేబర్ కమిషనర్ ఆఫీసు TCSకు సమన్స్ జారీ చేసింది. TCS ఈ ఆరోపణలపై 18వ తేదీలోపు స్పందించాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా TCS ఉద్యోగుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఆకస్మిక తొలగింపులు, బలవంతపు రాజీనామాలు, చట్టబద్ధమైన బకాయిలు ఇవ్వకపోవడం వంటివి అనేక చర్చలకు కారణం అవుతున్నాయి.
జులై 2025లో TCS తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం కట్ చేస్తానని ప్రకటించింది, అంటే సుమారు 12,000 మంది ఉద్యోగులు. AI వినియోగం, US టారిఫ్‌లు వంటి కారణాలతో 'ఫ్యూచర్-రెడీ' రీస్ట్రక్చరింగ్‌లో భాగమని తెలిపింది. అక్టోబర్ Q2 FY26 ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో చీఫ్ HR ఆఫీసర్ సుదీప్ కున్నుమల్, 6,000 మందిని ఇప్పటికే రిలీజ్ చేశామని, మిడ్ , సీనియర్ లెవల్‌ల్లో ఫోకస్ చేశామని చెప్పారు. యాభై, అరవై వేల మందిని తొలగిస్తున్నామని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. సెప్టెంబర్ 2025 నాటికి TCS హెడ్‌కౌంట్ 19,755 మంది తగ్గి 5,93,314కి చేరింది.
ఐటీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే యూనియన్ NITES, గత కొన్ని నెలలుగా TCS ఉద్యోగుల నుంచి బహుళ ఫిర్యాదులు స్వీకరించింది. పూణేలో మాత్రమే 2,500 మంది మిడ్-టు-సీనియర్ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో 10-20 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు ఉన్నారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, 1947 ప్రకారం 100 మంది పైగా ఉద్యోగులున్న సంస్థలు మాస్ లే ఆఫ్స్ కు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధనల విషయంలో ఉల్లంఘన జరిగిందని NITES చెబుతోంది. అక్టోబర్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాసి, పూణేలోని అక్రమ లేఅవుట్స్ ఆపమని కోరారు.
పూణే లేబర్ కమిషనర్ ఆఫీసు TCSకు అనేక ఫిర్యాదుల విషయంలో సమన్స్ జారీ చేసింది. గవర్నమెంట్ లేబర్ ఆఫీసర్ ముందు నవంబర్ 18న విచారణ జరగనుంది. ప్రతి ఎంప్లాయర్ చట్టపరమైన ప్రాసెస్ పాటించాలని, లేబర్ లాస్‌లు ఉల్లంఘించకూడదని అంటున్నారు. TCS లేఅవుట్స్‌పై ఇతర ఐటీ యూనియన్లు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. కర్ణాటక స్టేట్ IT/ITES ఎంప్లాయీస్ యూనియన్ (KITU), అసోసియేషన్ ఆఫ్ IT ఎంప్లాయీస్ (AITE)-కేరళ, యూనియన్ ఆఫ్ IT అండ్ ITES ఎంప్లాయీస్ (UNITE)-తమిళనాడు Q2లో 6,000 మంది లేఅవుట్స్‌కు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఉల్లంఘన అని ఆరోపించాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోమని కోరాయి.