ఆయనకు చదువంటే ఇష్టం. చదువు చెప్పడం అంటే మరింత మక్కువ. కానీ కాలం కలిసిరాకపోవడంతో దుర్భర స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్టున్నారు. కానీ దాదాపు పాతికేళ్లకు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇదంతా విని ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారు. కానే కాదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి రియల్ స్టోరీ ఇది. కానీ ఈ వయసులో టీచర్ జాబ్ ఎవరెవరికి ఇస్తారు, ప్రభుత్వం తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
1998లో డీఎస్సీ క్వాలిఫై.. కానీ !
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లక కేదారేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈయన చేనేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. చాలా ఏళ్ల కిందటే డిగ్రీ పూర్తి చేశారు. టీచర్ కావాలన్న లక్ష్యంతో అన్నా మలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కూడా చేశారు. 1994 డీఎస్సీలో కొన్ని మార్కుల తేడాతో జాబ్ రాలేదు. అయినా నిరుత్సాహ పడకుండా 1998లో డీఎస్సీ రాశారు. క్వాలిఫై అయినా రిక్రూట్‌మెంట్ వివాదం కోర్టుకు చేరడంతో అభ్యర్థుల ఎంపిక నిలిచిపోయింది. ఏళ్లు గడిచినా ప్రయోజనం లేకపోయంది. కానీ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆశలు చిగురించాయి.
24 ఏళ్ల తరువాత టీచర్ జాబ్..
డీఎస్సీలో క్వాలిఫై అయినా కోర్టు వివాదాలతో ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో ఆశలు వదులుకున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు దుస్తులు విక్రయించారు. ఆపై ఆటో నడుపుతూ జీవనం సాగించారు కేదారేశ్వరరావు. ఇవేమీ కలిసిరాకపోవడంతో ఉపాధి నిమిత్తం పదేళ్ల కిందట తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్ది రోజులకు కన్నతల్లీ అదృశ్యమైంది. దీంతో ఒంటరిగా తిరిగి గ్రామానికి చేరుకుని ధీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. బిక్షాటన చేస్తూ జీవితంపై తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ఉద్యోగాలపై సీఎం ప్రకటన రావడంతో ఎలా స్పందించాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సర్టిఫికెట్లు అన్ని ఉన్నాయి..
1994లో రావాల్సిన ఉద్యోగం, 1996లో కూడా పాసైనట్లు కేదారేశ్వరరావు తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల జాబ్ రాలేదన్నారు. అయితే 1998లో క్వాలిఫై అయ్యానని, ఇన్నేళ్ల తరువాత ఉద్యోగం వచ్చిందని చెప్పారు. చంద్రబాబు వేసిన ఉద్యోగాలు అని, కానీ ఆయన హయాంలో ఇవ్వలేదని, ఇన్నేళ్ల తరువాత కనికరం పుట్టిందన్నారు. తన వద్ద సెల్ ఫోన్ లేదని, తనకు సమాచారం ఇంకా అందలేదని చెప్పారు.
Also Read: CM Jagan Review Job Calendar : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, 8 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు
Also Read: TS Govt Jobs : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్