Singareni Coal Mines Operators Jobs : డ్రైవింగ్ వచ్చిన మహిళలకు సింగరేణి కాలరీస్‌ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో ఆపరేటర్‌ ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఓఎంసీలో మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఆపరేటర్లగా కూడా అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 


బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన ఓఎంసీలలో మహిళా ఆపరేటర్ల ఉద్యోగాల కోసం సింగరేణి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెషిన్ డ్రైవర్లుగా మహిళలను నియమించనుంది. ఇప్పటి వరకు ఈ పని పురుషలు మాత్రమే చేస్తూ వచ్చారు. తొలిసారిగా మహిళలను నియామకానికి సీఎండీ ఆంగీకరించారు.  సింగరేణి వ్యాప్తంగా రెండు వేలకుపైగా మహిళలు పని చేస్తున్నారు. మహిళలంతా ఒకే షిప్టులో పని చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు, పురుషులతో పోలిస్తే వారు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించేందుకు మెషిన్ ఆపరేటర్లు నియమించాలని నిర్ణయించారు. 


ప్రస్తుతం సింగరేణి విడుదల చేసిన  నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగాల్లో డ్రైవింగ్ వచ్చిన మహిళలు మాత్రమే అర్హులు. జనరల్ అసిస్టెంట్‌, ట్రాన్స్‌ఫర్‌ వర్కర్స్‌గా పని చేస్తూ 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఏడో తరగతి పాస్ అయ్యి ఉండాలి. శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి. టూ వీలర్, లేదా ఏదైనా ఫోర్ వీలర్ నడపగలిగాలి. 2024 ఆగస్టు కంటే ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు.  


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


సింగరేణిలో మహిళలు పని చేస్తున్న విభాగంలో మేనజర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. లేదా జీఎం ఆఫీస్‌లోకూడా దరఖాస్తు సమర్పించవచ్చు. వీటిని చీఫ్‌ ప్లానింగ్ ప్రాజెక్టు కమిటీ పరిశీలిస్తుంది. ముందుగా అర్హతలను బట్టి స్క్రూట్నీ చేస్తారు. తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తారు.  


ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది?


సిరిసిల్లాలో ఉన్న తెలంగాణ డ్రైవింగ్ స్కూల్‌ లో ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే ఉద్యోగాలు వచ్చినట్టు కాదు. అప్పుడు ఖాళీలను బట్టి పరీక్ష పెడతారు. అందులో ఎంపికైన వారికి మాత్రమే ఆపరేటర్లుగా కేటగిరి -5లో ఉద్యోగాలు ఇస్తారు. మొదట్లో వారితో చిన్న చిన్న వాహనాలు నడిపిస్తారు. అనుభవం వచ్చిన తర్వాత భారీ వాహనాలు నడిపే పని అప్పగిస్తారు.