SBI fires man for low CIBIL score : ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి వరకూ సైకోమెట్రిక్ టెస్టులు పెడుతున్నాయి కంపెనీలు. ఇప్పుడు ఈ సైకోమెట్రిక్ టెస్టుల కన్నా.. అసలు రియాలిటీని విశ్లేషించాలనుకుంటున్నాయి. అందుకే సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తున్నాయి.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తమ దేశానికి వచ్చే వారి సోషల్ మీడియా ఖాతాల్ని చెక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కంపెనీ.. తాము ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్న వారి సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తున్నాయి. 

అప్పులు కావాలంటే సిబిల్ స్కోర్ బాగుండాలని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటారు.  కానీ ఇపుడు అది కండక్ట్ సర్టిఫికెట్ గా కంపెనీలు మార్చేస్తున్నాయి.   అన్ని పరీక్షల్లో ..ఇంటర్యూల్లో పాసైన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చేందుకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరించింది.

ఉద్యోగానికి ఎంపికైనా ..తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని ఇటీవల ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషనర్ SBIలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్  CBO పోస్టుకు ఎంపికయ్యాడు.  దరఖాస్తు చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష,  డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేశాడు. ఎస్బీఐ అపాయింట్ మెంట్ లెటర్ కూడా పంపించింది. కానీ తీరా ఉ్దోయగంలో చేరేందుకు వెళ్లిన సమయంలో చేర్చుకునేందుకు నిరాకరించారు. దానికి కారణం వారు .. సిబిల్ స్కోరును చూపించారు. 

ఆ అభ్యర్థి లోన్లు తిరిగి చెల్లించడంలో  దీర్ఘకాల డిఫాల్ట్ హిస్టరీని కలిగి ఉన్నాడు. వ్యక్తిగత రుణాలు , క్రెడిట్ కార్డులను వాడుకుని చెల్లించకపోవడం వంటివి చేశాడు. ఒక రుణం రైట్-ఆఫ్ అయితే న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు.  ఐదేళ్లలో  50కి పైగా రుణ ఎంక్వైరీలు ఉన్నట్లు తేలింది. ఇలా చేస్తారని తెలియడంతోనే.. ముందుగానే ఆ అభ్యర్థి జాగ్రత్తపడ్డాడు. అన్ని రుణాలు చెల్లించేశాడు. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పాడు.  తాను  అన్ని రుణాలు , బకాయిలు చెల్లించానని వాదించాడు.  కానీ ఎస్‌బీఐ సిబిల్ స్కోరును ప్రస్తావించింది.  

 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లోని క్లాజ్ 1(E) ప్రకారం  ప్రతికూల క్రెడిట్ రిపోర్టు లేదా రుణ డిఫాల్ట్ హిస్టరీ ఉన్న అభ్యర్థులను అనర్హులుగా చేయవచ్చని హైకోర్టుకు చెప్పింది. బ్యాంక్ ఉద్యోగులు పబ్లిక్ డబ్బును నిర్వహించేందుకు కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, పిటిషనర్ క్రెడిట్ హిస్టరీ అటువంటి క్రమశిక్షణ లేనిదిగా ఉందని వాదించింది.   హైకోర్టు ఎస్‌బీఐ వాదనతో ఏకీభవించింది.  బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగులు పబ్లిక్ డబ్బును నిర్వహిస్తారు కాబట్టి, SBI నిర్ణయం సమంజసమని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు సాధించాలంటే సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక నుంచి అందరూ జాగ్రత్తపడాలి.