RRB Exam Prepare Plan: ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థగా భారతీయ రైల్వేకు గుర్తింపు ఉంది. అంతేకాదు, అతిపెద్ద ఉద్యోగ కల్పనా సంస్థ కూడా భారతీయ రైల్వేనే. ప్రతీ ఏటా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా లక్షలాది ఉద్యోగాలను రైల్వే శాఖ భర్తీ చేస్తుంది. అందుకోసం పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది.

అలాంటి ప్రతిష్టాత్మక రైల్వే శాఖలో మీరు ఉద్యోగిగా చేరాలంటే, ఏయే పోస్టులు ఎక్కువగా పడతాయి, వాటికి ప్రధాన అర్హతలు ఏంటి అన్న విషయాలు తప్పక తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి. రైల్వే నియామకాల తీరుతెన్నులపై మీకు పూర్తి అవగాహన కలుగుతుంది.

రైల్వేస్‌లో టెక్నికల్, నాన్-టెక్నికల్ ఉద్యోగాలు ఉంటాయి. అవేంటో వరుసగా చూద్దాం.

1. RRB NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) ఉద్యోగాలు

ఇందులో 12వ తరగతి లేదా డిగ్రీ పాస్ అయినవారు ఈ నాన్-టెక్నికల్ జాబ్స్‌కు అర్హులు. ఇందులోని పోస్టులు:

  • జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్
  • అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్
  • కమర్షియల్ అప్రెంటిస్
  • ట్రాఫిక్ అసిస్టెంట్
  • గూడ్స్ గార్డ్
  • స్టేషన్ మాస్టర్

ఆయా పోస్టుల అర్హతను బట్టి, 12వ తరగతి పాస్ లేదా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే, ప్రిలిమ్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT - Computer Based Test). ఇక టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అవసరమైన పోస్టులను బట్టి ఉంటాయి. పరీక్షలో అర్హత సాధిస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

2. RRB గ్రూప్-డి (RRC లెవెల్-1) ఉద్యోగాలు

ఇవి పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం ఉద్దేశించినవి. ఓ రకంగా చెప్పాలంటే ఇవి ఎంట్రీ లెవల్ పోస్టులు. ఇందులో ఉండే పోస్టులు:

  • ట్రాక్ మెయింటెయినర్
  • పాయింట్ మ్యాన్
  • హెల్పర్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎస్&టీ)
  • హాస్పిటల్ అసిస్టెంట్

ఈ పోస్టులకు పదో తరగతి పాస్ అయి ఉండాలి. దీంతోపాటు గుర్తింపు పొందిన ఐటీఐ నుంచి కూడా పాస్ అయి ఉండాలి. ఈ పోస్టులకు పరీక్షలు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షలే నిర్వహిస్తారు. దీంతోపాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) కూడా ఉంటుంది. ఈ పరీక్షల్లో నెగ్గితే, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ తర్వాత విధుల్లోకి తీసుకుంటారు.

3. RRB ALP (అసిస్టెంట్ లోకో పైలట్) & టెక్నీషియన్ ఉద్యోగాలు

ఇందులో రైలు ఇంజిన్‌ను నడపడం (లోకోమోటివ్), నిర్వహణ, నియంత్రణ వంటి విధులు ఉంటాయి. దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షల నిర్వహణ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో ఉండే పోస్టులు:

  • అసిస్టెంట్ లోకో పైలట్
  • టెక్నీషియన్ గ్రేడ్-III

ఈ పోస్టులకు పదో తరగతితోపాటు ఐటీఐ లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. ఈ పోస్టుల ఎంపిక కోసం రెండు దశల పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి దశ పరీక్షలో గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఈ దశ పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో క్వాలిఫై అయితేనే రెండో దశ పరీక్షకు అర్హత సాధిస్తారు.

ఇక రెండో దశ పరీక్ష పార్ట్-ఏ, పార్ట్-బీగా నిర్వహిస్తారు.

పార్ట్-ఏలో గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

పార్ట్-బీ అనేది క్వాలిఫైయింగ్ విభాగం. ఇందులో కేవలం అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ఈ మార్కులకు ప్రాధాన్యం ఉండదు. పార్ట్-బీలో మీరు ఎంచుకున్న ట్రేడ్‌కు సంబంధించిన సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అంటే మీరు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ డిప్లొమాలో చదివిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పాస్ అవ్వాలంటే కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండో దశ పరీక్షలో పార్ట్-ఏ లో వచ్చే మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అసిస్టెంట్ లోకో పైలట్‌లకు మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహిస్తారు. ఈ పరీక్షను సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. రైలు నడపడానికి అవసరమైన శారీరక, మానసిక సామర్థ్యం ఉందా లేదా అన్నది ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. దృష్టి, అప్రమత్తంగా ఉండి స్పందించడం, సందర్భాన్ని బట్టి వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందా లేదా అన్న నైపుణ్యాలను ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. ఇందులో మెమరీ టెస్ట్, ఫాలోయింగ్ డైరెక్షన్స్ టెస్ట్, డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ (దూరం అండ్‌ లోతును అంచనా వేసే సామర్థ్యం), కన్సంట్రేషన్ టెస్ట్, పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ వంటివి ఉంటాయి. తుది ఎంపికలో ఈ పరీక్షలో సాధించే మార్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

4. RRB JE (జూనియర్ ఇంజినీర్), DMS, CMA

ఈ పోస్టులను ఇంజనీరింగ్, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఇందులో ఉండే పోస్టులు:

  • జూనియర్ ఇంజినీర్ (JE)
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS)
  • కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA)

వీటికి అర్హతగా ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అవసరమవుతుంది. ఇందులో కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను రెండు దశలుగా నిర్వహిస్తారు. వీటిలో పాస్ అయిన వారిని ఈ పోస్టులలో నియమిస్తారు.

5. RRB పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామ్

ఈ పోస్టులు భారతీయ రైల్వే వ్యవస్థలో అంతర్భాగమైన వైద్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించినవి. ఇందులో ఉండే పోస్టులు:

  • స్టాఫ్ నర్స్
  • ఫార్మసిస్ట్
  • ల్యాబ్ అసిస్టెంట్
  • రేడియోగ్రాఫర్
  • హెల్త్ ఇన్‌స్పెక్టర్

ఈ పోస్టులకు అర్హతలు సంబంధిత మెడికల్ ఫీల్డ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వీటికి ఒకేసారి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

6. RRB మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీస్

ఇందులో క్లరికల్ పోస్టులతో పాటు ప్రత్యేకమైన అవసరాల కోసం నిపుణులను నియమిస్తారు. ఇందులో ఉండే పోస్టులు:

  • స్టెనోగ్రాఫర్
  • ట్రాన్స్‌లేటర్
  • లా అసిస్టెంట్
  • కుక్
  • చీఫ్ టైపిస్ట్

ఈ పోస్టులను బట్టి అవసరమైన అర్హతలను ఆర్.ఆర్.బి. అడుగుతుంది. దీనికి సాధారణంగా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా చేసి ఉండాలి. పోస్టుకు కావాల్సిన నైపుణ్యం కలిగి ఉండాలి. ఇందులోనూ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత పోస్టులో అడిగే నైపుణ్యంపై పరీక్ష నిర్వహిస్తారు.

7. RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)

ఇందులో రైల్వే భద్రత కోసం భద్రతా బలగాల నియామకాలు ఉంటాయి. ఇందులో ఉండే పోస్టులు:

  • ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
  • ఆర్పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్.ఐ.)

ఇందులో కానిస్టేబుల్ పోస్టులకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఎస్.ఐ. పోస్టులకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ పరీక్షను కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. దీంతో పాటు ఈ పోస్టుకు అవసరమైన నిర్ణీత శారీరక కొలతలు కలిగి ఉండాలి, శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ పాస్ అవ్వాల్సి ఉంటుంది.

8. RRC యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్

ఇది ఐటీఐ పూర్తి చేసిన వారి కోసం ఏర్పాటు చేసింది. దీనికి ఎలాంటి అర్హత పరీక్ష ఉండదు. ఇందులో ఉండే పోస్టులు: ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ వంటి పోస్టులు ఉంటాయి) దీనికి అర్హత పదవ తరగతితో పాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్‌ను బట్టి వీరిని ఎంపిక చేస్తారు.

భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు పైన మీరు చదివిన పోస్టులను ఎక్కువగా భర్తీ చేస్తుంది. పదవ తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల వరకు, నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ వంటి వాటిని భర్తీ చేస్తుంది. అయితే ప్రతీ పరీక్షకు దాని స్వంత సిలబస్ ఉంటుంది. మీ అర్హతలను బట్టి ఆ పోస్టులను ఎంపిక చేసుకుని, ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు సులభంగా ఈ ఉద్యోగాలను సాధించవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం, ఏ పోస్టులకు మీ అర్హతలు సరిపోతాయో ఆ పోస్టులకు సంబంధించి మీ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించండి!