TGPSC Group 1 Posts | హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ల తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ గ్రూప్-1 జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని, కుదరని పక్షంలో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి తిరిగి 8 నెలల్లో రీఎగ్జామ్ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని టీజీపీఎస్సీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో, ఉన్నత న్యాయస్థానం డివిజ్ బెంచ్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకర్లకు భారీ ఊరట కలిగింది.
డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలుతెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల కోసం దశాబ్దానికి పైగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇదివరకే గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు రెండు పర్యాయాలు రద్దు చేశారు. ప్రస్తుతం మెయిన్స్ పూర్తి చేసి ర్యాంకుల జాబితా వచ్చింది. ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వడమే తరువాయి అన్న సమయంలో ఇలాంటివి జరగడం బాధాకరమని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదంటూ పెద్ద మాటలు వాడకం సరికాదని అభిప్రాయపడింది.
గ్రూప్ 1 పోస్టుల అంశం పిటిసన్‌పై తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను, తుది మార్కుల జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. మెయిన్స్ సమాధానపత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. వీలుకాని పక్షంలో 8 నెలల్లోపు మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. చివరగా ఉమ్మడి ఏపీలో 2011లో గ్రూప్-1 నిర్వహించి పోస్టులు భర్తీ చేశారు. ఆ తర్వాత 2022లో నిర్వహించగా ఆ పరీక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తరువాత లీకుల వ్యవహారం, వాల్యుయేషన్ లో అవకతవకల ఆరోపణలతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సూచనతో తెలంగాణ హైకోర్టు ఫలితాలు రద్దు చేసింది. 14 ఏళ్లు పూర్తైనా గ్రూప్-1 నియామకాలు ఒక్కసారి జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. తెలుగులో మెయిన్స్ ఆన్సర్ సీట్లు రాసిన వారిపట్ల పక్షపాతం చూపించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. జనరల్ ర్యాంకింగ్స్ విషయంలోనూ తప్పిదాలు జరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదు’’ అని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆధారాలు లేవని సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు స్టేపరీక్ష నిర్వహణలో ఏమైనా మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్‌లాంటి ఘటనలు జరిగాయా అని హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (AK Singh) అడిగారు. కొందరిపట్ల పక్షపాతం చూపించారనడానికి ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు చూపించలేదని, ఏపీలో గ్రూప్స్ పరీక్షల్లో తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా సెలక్ట్ అయ్యారని ఏజీ తెలిపారు. పురుషులకు వాష్‌రూమ్‌లు లేవన్న కారణంగా రెండు కేంద్రాల్లో మహిళలకు మాత్రమే సెంటర్ కేటాయించినట్లు చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్ల జారీని తప్పుబట్టారని సీజేకు తెలిపారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తప్పు పట్టేందుకు కారణాలు లేవని, సాక్ష్యాలు లేవని నిర్ధారించుకున్నాక డివిజన్ బెంచ్ నియామకాలకు అడ్డంకులు తొలగించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడంతో అటు టీజీపీఎస్సీకి, ఇటు గ్రూప్ 1 ర్యాంకర్లకు ఉపశమనం కలిగింది. దసరా పండుగ సమయంలో గ్రూప్ 1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు డివిజన్ బెంచ్ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.