PM-VBR Apply Online: యువతకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన: లక్ష్యాలు, ఖర్చు
దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపి, ఉద్యోగ కల్పన కోసం మోదీ సర్కార్ ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ₹99,446 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం రెండేళ్ల పాటు, అంటే 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు, అమలులో ఉంటుంది. పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా దేశంలో 3.5 కోట్ల ఉద్యోగాలు సృష్టించగలమని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలిసారిగా ఉద్యోగంలోకి ప్రవేశించే యువతకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల్లో దాదాపు 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగంలోకి ప్రవేశించే యువతకు ఈ పథకం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకంలో విశేషం ఏమిటంటే, కేవలం యువతకు మాత్రమే కాకుండా, ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహం ఇవ్వడం.
రెండు వర్గాలకు ప్రయోజనం కల్పించనున్న పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన
1. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు లబ్ధి - ప్రైవేటు రంగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో నమోదు చేసుకున్న తర్వాత, గరిష్టంగా ₹15,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని ఈ పథకంలో భాగంగా అందుకుంటారు. అయితే, ఈ మొత్తం ఒకేసారి కాకుండా రెండు విడతల్లో చెల్లిస్తారు.
2. ప్రైవేటు కంపెనీలకు లాభం - కొత్తగా ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు కేంద్ర సర్కార్ ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా ₹3,000 వరకు ప్రోత్సాహం ఇస్తుంది. ఈ మొత్తం కంపెనీలకు చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రోత్సాహం ద్వారా కంపెనీలు మరింత మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రేరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ భావన. మొదట రెండేళ్లపాటు దీనిని కంపెనీలకు చెల్లిస్తారు. ఇలా దీనిని నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది.
ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన పథకం అటు ఉద్యోగంలో చేరిన యువతకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహం ఇస్తుంది. తయారీ రంగానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడానికి ఇది కీలకంగా ఉపయోగపడనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం 2025 ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు.