ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (OIL) జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సంస్థ కార్యాలయాల్లో ఉన్న 120 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన వారి వేతనం (పే స్కేల్) గ్రేడ్ 3 ప్రకారం రూ.26,600 నుంచి రూ.90,000 వరకు ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://www.oil-india.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 





విద్యార్హత ఏంటి?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు నుంచి 10+2 (ఇంటర్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిప్లొమా లేదా కంప్యూటర్‌ అప్లికేషన్‌లో కనీసం ఆరునెలల పాటు శిక్షణ పొందినట్లు సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి. ఎమ్మెస్‌ వర్డ్‌ (MS Word), ఎమ్మెస్‌ ఎక్సెల్‌ (MS Pixel) , ఎమ్మెస్‌ పవర్‌ పాయింట్‌లు (MS Power Point) తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయసు సడలింపు ఉంది. 
పరీక్ష విధానం.. 
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. సెక్షన్ A క్రింద ఇంగ్లిష్ లాంగ్వేజ్ & జనరల్ నాలెజ్డ్ / ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన ప్రశ్నలకు 20 శాతం మార్కులు కేటాయించారు. సెక్షన్ Bలో రీజనింగ్, అర్ధమెటిక్ / న్యూమరికల్ & మెంటల్ ఎబులిటీ ప్రశ్నలకు 20 శాతం మార్కులను ఇచ్చారు. సెక్షన్ Cలో టెక్నికల్ నాలెజ్డ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 శాతం మార్కులు కేటాయించారు. మొత్తం 100 (శాతం) మార్కులకు జరగనున్న ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషలలో అందుబాటులో ఉంటుంది. మొత్తం 2 గంటల పాటు పరీక్ష కొనసాగనుంది. 
దరఖాస్తు చేసుకోండిలా.. 



  • అభ్యర్థులు https://www.oil-india.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • ఇందులో కెరీర్స్ ఆప్షన్‌లో కరెంట్ ఓపెనింగ్స్‌ను క్లిక్ చేయాలి.

  • ఇక్కడ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల నోటిఫికేషన్ ఉంటుంది. దీని పక్కన Apply Online అనే లింక్ ఉంటుంది. అందులో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవడంతో రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుంది. 

  • దరఖాస్తు ప్రక్రియ, పరీక్షకు సంబంధించి అనుమానాలు ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్లు 8866678549, 8866678559 లేదా helpdesk.oilindia@cbtexams.in ఈమెయిల్‌ను సంప్రదించవచ్చని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ అభ్యర్థులకు సూచించింది. 


రిజర్వేషన్ల వారీగా ఖాళీలు.. 
జనరల్ - 54
ఎస్సీ - 08
ఎస్టీ - 14
ఓబీసీ (ఎన్సీఎల్) - 32
ఈడబ్ల్యూఎస్ - 12