Fake Notification in Telangana: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖలో ఉద్యోగాలంటూ భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఫేక్ నోటిఫికేషన్లు అని సంబంధింత అధికారులు హెచ్చిరిస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్ స్పందించినట్లు ఫ్యాకల్టీ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. ఇది నకిలీ నోటిఫికేషన్ అని ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పేరుతో ఎలాంటి విభాగం కానీ, పథకం కానీ లేదని తెలిపారు. జూలై 2022లోనూ ఇదే తరహా నోటిఫికేషన్ వెలువడిందని, అది కూడా నకిలీదిగా తేలిందని చెప్పారు. ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన నిరుద్యోగులకు సూచించారు.
జాతీయ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధికి సంబంధించి ఏపీలో 6881, తెలంగాణలో 6881 ఖాళీలు కలిపి మొత్తం 13,762 ఖాళీలు ఉన్నట్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకు ఫిబ్రవరి 28 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, దరఖాస్తు చేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ వెల్లడి..
నేషనల్ రూరల్ డెవల్‌పమెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ (NRDRM) పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ తేలింది. నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నమని పేర్కొంది. ఈ నోటిఫికేషన్లు నకిలీవని స్పష్టం చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద NRDRM అని పిలువబడే అటువంటి సంస్థ ఏదీ లేదని, ఈ ఫేక్ యాడ్‌పై అలర్ట్ చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించామని ఐఈసీ విభాగాధిపతి అఖిలేశ్ జా చెప్పినట్లు న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ తన కథనంలో ప్రస్తావించింది.
జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగ యువత జాగ్రత్తగా ఉండాలని, నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ నోటిఫికేషన్లను లేదా వాటి వెబ్‌సైట్ వివరాలను తప్పకుండా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్ డొమైన్లు అడ్రస్‌లు 'gov.in' లేదా 'nic.in'తో ముగుస్తాయని సూచిస్తున్నారు. ఒకవేళ వెబ్‌సైట్ డొమైన్ అడ్రస్‌లో ఏమైనా తేడాలుంటే, అలాంటి వెబ్‌సైట్‌లలోకి వెళ్లకపోవటం మంచిది.