NITES letter to Union labour minister to Halt all terminations in TCS | న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద IT సేవల సంస్థ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఏకంగా 12000 మందికి పైగా ఉద్యోగాలు జాబ్స్ కోల్పోయి రోడ్డున పడనున్నారు. టీసీఎస్ చేసిన లేఆఫ్స్ ప్రకటనపై Nascent ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాసింది. ఎలాగైనా సరే ఈ జాబ్స్ టర్మినేషన్ ప్రక్రియను నిలుపుదల చేసి ఉద్యోగాలు కాపాడాలని కేంద్ర మంత్రిని NITES కోరింది.
2 శాతం ఉద్యోగాల్లో TCS కోత
టీసీఎస్ సంస్థ దాని శ్రామిక శక్తిలో సుమారు 2 శాతం ఉద్యోగాలలో కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగులలో 12000 మందికి పైగా జాబ్స్ కోల్పోనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం అమలులోకి రానుంది. దాంతో ఎలాగైనా టీసీఎస్ సంస్థలో ఉద్యోగుల టర్మినేషన్ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆ ఉద్యోగుల ఫోరం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాకు సోమవారం నాడు లేఖ రాసింది.
టీసీఎస్ కంపెనీ గతంలో 2015లో సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో సంస్థ మొత్తం సిబ్బందిలో దాదాపు 1శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా 2 శాతం ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకోవడంతో ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
TCS లేఆఫ్స్ ప్రక్రియను నిలిపివేయాలని కోరిన NITESప్రముఖ టెక్ సర్వీస్ దిగ్గజం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటించిన ఉద్యోగాల కోతపై ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అందులో భాగంగా IT కార్మికుల సంఘం NITES కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. ఈటీ నివేదిక ప్రకారం, IT కార్మికుల సంస్థ ఈ తొలగింపులకు ఉన్న చట్టబద్ధతను సవాలు చేసింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను నిలిపివేసి, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని TCSకు సూచించాలని ఐటీ ఉద్యోగుల ఫోరం తమ లేఖలో కేంద్రాన్ని కోరింది.
సరైన నిర్ణయాలు, లేదా జవాబుదారీతనం లేకుండా పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు టీసీఎస్ సంస్థను అనుమతించడం వల్ల ఇది ఇతర సంస్థలకు సైతం మెస్సేజ్ ఇచ్చినట్లు అవుతుంది. వారు సైతం లేఆఫ్స్ కు మొగ్గు చూపుతారు. తద్వారా ఐటీ రంగంలో అనిశ్చితి, కార్మికుల రక్షణ తగ్గుతుంది. ఉద్యోగాలు, సంస్థలపై నమ్మకం తగ్గుతాయని తమ లేఖలో ఐటీ ఉద్యోగుల యూనియన్ పేర్కొంది.
ఉద్యోగాల్లో భారీ కోత విధిస్తున్న సమయంలో టీసీఎస్ సీఈవో జీతం పెంపును యూనియన్ ప్రస్తావించింది. ఇలాంటి సందర్భంలో కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ దీనికి బాధ్యత వహించాలని NITES కేంద్ర మంత్రిని కోరింది. TCS వార్షిక నివేదిక ప్రకారం, సీఈవో కే కృతివాసన్ FY25లో రూ. 26.5 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. గత ఆర్థిక ఏడాది కంటే ఇది 4.6 శాతం పెరుగుదల. సగటు ఉద్యోగి జీతం కంటే సీఈవోకు 329.8 రెట్లు ఎక్కువ వేతనం వస్తుందన్నారు. అదనంగా, TCS యొక్క ఆలస్యమైన ఆన్‌బోర్డింగ్ పద్ధతులపై దర్యాప్తుకు NITES పిలుపునిచ్చింది. ఈ నెల ప్రారంభంలో రిక్రూట్ చేసుకున్న 600 మంది ఉద్యోగుల ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో జాప్యాన్ని యూనియన్ హైలైట్ చేసింది.
టీసీఎస్ సంస్థపై ట్రేడ్ యూనియన్ల విమర్శలు..భారీగా ఉద్యోగుల తొలగింపు చట్టవిరుద్ధమని IT రంగ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నాయి. కర్ణాటక రాష్ట్ర IT/ITeS ఉద్యోగుల సంఘం సిబ్బంది కోత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సంస్థకు విజ్ఞప్తి చేసింది. రాజీనామా చేయమని టీసీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి చేయకూడదని ఫోరం ఫర్ IT ఉద్యోగుల (FITE) సిఫార్సు చేసింది. జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు నోటీసు పీరియడ్ శాలరీతో పాటు ఇతర ప్యాకేజీలు ఇవ్వాలని కోరింది. 12 నెలల పాటు ఆరోగ్య బీమా ప్రయోజనాలను అందించాలని సూచించింది.