AP DSC 2024: ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నాలుగేళ్లుగా మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా టెట్ (AP TET), డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్లు విడుదల చేసింది. కేవలం 50 రోజుల వ్యవధిలో టెట్, డీఎస్సీ పరీక్షలు పూర్తి చేయాలని భావించింది. అయితే మార్చి 4న హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం డీఎస్సీ పరీక్షలు జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టెట్ పరీక్షలకూ, డీఎస్సీ పరీక్షలకూ మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలన్న సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల ఆధారంగా అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించి షెడ్యూల్ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. దీంతో పరీక్షలపై ముందుకెళ్లాలా? కొత్త షెడ్యూలు ప్రకటించాలా? అన్నది ప్రభుత్వం యోచిస్తోంది. 


ఒకవేళ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసి, కొత్త షెడ్యూలును ప్రకటిస్తే.. టెట్ ఎగ్జామ్‌ ముగిసిన నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ నుండి డీఎస్సీ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ప్రిలిమినరీ కీ విడుదల చేసిన తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని కోర్టు తెలిపింది. మరోవైపు పేపర్‌-1 ఎస్‌జీటీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో మాత్రమే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. 


టెట్‌ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేసి.. ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి 9తో టెట్ పరీక్షలు ముగియనున్నాయి. మరోవైపు.. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి.. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే.. టెట్‌, డీఎస్సీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీ విడుదల నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తదనంతరం జారీ చేసే తుది కీ ప్రక్రియకు చాలా తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నిర్ణయం సహేతుకంగా లేదని పేర్కొంది.


మరో 5 రోజుల్లో టెట్ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత నుంచి నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ అలా జరిగినా డీఎస్సీ పరీక్షలు పూర్తయి ఫలితాలు ప్రకటించే సరికి మే నెల వచ్చేస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహించి ఫలితాలు వెల్లడించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక డీఎస్సీ పరీక్షల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో విద్యాశాఖ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


ALSO READ:


'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ (స్ర్కీనింగ్ టెస్ట్) పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10 నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ మార్చి 8న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలని కమిషన్ సెక్రటరీ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...