తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొలిక్కివచ్చింది. మొత్తం 6,603 జేపీఎస్‌లను 'గ్రేడ్-4' పంచాయతీ కార్యదర్శులుగా గుర్తిస్తూ.. ఆర్థిక శాఖ శనివారం (సెప్టెంబరు 16న) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జేపీఎస్‌లు ఇకపై పంచాయతీరాజ్ కార్యదర్శులుగా గ్రేడ్-4 హోదాలో కొనసాగనున్నారు.
గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలనే లక్ష్యంతో ఒకేసారి 9వేలకు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. వీరికి పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని జేపీఎస్‌లుగా నియమించారు.
గత నాలుగు సంవత్సరాలుగా వీరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారందరినీ క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, డీఎస్పీ, డీఎఫ్‌వోలతో కమిటీని నియమించి రెగ్యులరైజేషన్‌కు అర్హులైన వారి జాబితాను పంచాయతీరాజ్‌కు అందించారు.
జేపీఎస్‌లను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4లను క్రియేట్ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ శాఖ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టులపై ఆర్థిక శాఖ సెప్టెంబరు 16న ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుండగా... వారిలో 5,435 మందే నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారికి మరో ఆరు నెలల తర్వాత నాలుగేళ్ల సర్వీసు పూర్తవుతుంది. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వారి పనితీరుపై అధ్యయనానికి జిల్లాల్లో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో మదింపు కమిటీలను ఏర్పాటు చేసింది. జులై నుంచి వారు గ్రామాల్లో పర్యటించి కార్యదర్శుల పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ కమిటీలు నివేదికలు ఇచ్చాక 70 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికే పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం లభిస్తుంది.
జేపీఎస్‌లలో అసంతృప్తి..
తమను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై జేపీఎస్‌లు ఆనందపడినా... నిబంధనలను చూసి తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. నాలుగేళ్లుగా సేవలందిస్తున్న తమను నేరుగా క్రమబద్ధీకరించకుండా... జిల్లాస్థాయి మదింపు కమిటీలను ఏర్పాటు చేసి, పాఠశాల విద్యార్థుల మాదిరిగా మార్కులు వేయిస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నత విద్యావంతులమైన తాము మెరిట్ ద్వారా ఉద్యోగాలు సంపాదించినట్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మదింపులో 70 శాతం మార్కులు రావాలని నిబంధన పెట్టడం సరికాదంటున్నారు. మార్కులు రానివారి పనితీరును మరో ఏడాదిపాటు పరిశీలిస్తామని చెప్పడమూ అన్యాయమేనని వాపోతున్నారు. ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం తమకు రెండేళ్ల శిక్షణ(ప్రొబేషనరీ) మాత్రమే అవసరమైనా... నాలుగేళ్లపాటు శిక్షణలోనే ఉంచిందని, ఆ కాలాన్ని పరిగణనలోనికి తీసుకోకుండానే నియామకపు ఉత్తర్వులు ఇవ్వడంతో తాము రెండేళ్ల సర్వీసును నష్టపోయినట్లేనని పేర్కొన్నారు.
ALSO READ:
TS TET: సెప్టెంబరు 27న 'టెట్' ఫలితాల వెల్లడి, త్వరలోనే ఆన్సర్ 'కీ' విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబరు 15న సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..