IBPS Clerk Recruitment: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ (ఐబీపీఎస్) క్లరికల్ రిక్రూట్‌మెంట్ -XI ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలతో ఐబీపీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక వచ్చే వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఐబీపీఎస్‌ను ఆదేశించింది. దీనిపై స్పందించిన ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తన అధికారిక వెబ్‌సైట్‌లో (https://ibps.in/) పేర్కొంది.
దేశంలోని రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (Regional Rural Banks) రిక్రూట్‌మెంట్లను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక 15 రోజుల్లో రానున్న నేపథ్యంలో, అప్పటివరకు పరీక్షలు నిర్వహించవద్దని మంత్రి ఐబీపీఎస్‌ను ఆదేశించారు.
సిద్ధరామయ్య ట్వీట్‌తో..
దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్ ఖాళీల భర్తీ కోసం ఐబీపీఎస్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే ఐబీపీఎస్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే డిమాండ్ చేస్తూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వరుసగా పలు ట్వీట్లు చేశారు.
ఐబీపీఎస్ పరీక్షను కన్నడ భాషలో నిర్వహించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన నిర్మల.. దరఖాస్తుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐబీపీఎస్‌ను ఆదేశించారు. ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన కమిటీ తన నివేదిక ఇచ్చే వరకు ప్రక్రియను వాయిదా వేయాలని తెలిపారు. దీంతో క్లర్క్ దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్ పడింది.
తెలుగులోనూ పరీక్షలు..
క్లరికల్ క్యాడర్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ ఇటీవల వెలువరించిన ప్రకటనలో తెలిపింది. ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేసే వాటిలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) ఉద్యోగాలు ఉంటాయి. వీటన్నింటికీ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలనేది దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్‌గా ఉంది. దీనికి మద్దతుగా కేంద్ర ఆర్థిక శాఖ 2019లో పార్లమెంట్ వేదికగా ప్రకటన చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇదే కనుక అమలైతే తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనే అభ్యర్థులు పరీక్షలు రాయవచ్చు. బ్యాంకు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఇది లాభదాయకంగా మారనుంది.
ఇదీ నోటిఫికేషన్..
దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ సీఆర్‌పీ XI నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) విధానంలో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 263, తెలంగాణలో 263 ఖాళీలు ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుల్లోని క్లర్క్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కేంద్రం ఆదేశాలతో దరఖాస్తు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కమిటీ నివేదిక వెలువడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ తిరిగి కొనసాగనుంది.