తెలంగాణలో జూన్‌ 11న నిర్వహించనున్న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్, ఈడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష నిర్వహించరాదని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ఎస్‌.మురళీధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పి.మాధవీదేవి జూన్‌ 6న విచారణ చేపట్టారు. 


పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతుండగా అదే కమిషన్‌ పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులకు అనుమానం ఉందని తెలిపారు. గతేడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు గైర్హాజరైనవారిని రెండోసారి నిర్వహించే పరీక్షకు అనుమతించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అప్పగించాలని కోరారు. 


సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే ఒక పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని.. దీనిపై దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిందని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు తెలిపారు. ఇరువురి వాదనలను విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉన్నదానితో జత చేయాలని ఆదేశించారు.


Also Read:


గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ జూన్ 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓఎంఆర్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. 


గ్రూప్-1 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 503 పోస్టులతో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఇక ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో 5 ప్రశ్నలు తొలగించి కమిషన్ తుది కీ ఖరారు చేసింది.


పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్ చేసి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 


గ్రూప్-1 పరీక్ష విధానం, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...