తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్షను సెప్టెంబరు 15న నిర్వహించనున్నారు.  పరీక్ష నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. పేపర్‌-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, పేపర్‌-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు రాయనున్నారు. అయితే ఇందులో పేపర్‌-1 రాసేవారే చాలా మంది పేపర్‌-2ను కూడా రాస్తున్నారు. టెట్‌ పరీక్షకు నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. 


పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1139 పరీక్షా కేంద్రాల్లో పేపర్‌-1 పరీక్ష, 913 కేంద్రాల్లో పేపర్‌-2  పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు సంబంధించి 'పేపర్‌-1'కు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 'పేపర్‌-2'కు 2,08,498 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తంగా 4,78,055 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షను రాయనున్నారు.


పరీక్ష నిర్వహణ కోసం విధులు నిర్వహించేందుకుగానూ ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కరు చొప్పున్న మొత్తం 2052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులు, 2052 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లను నియమించారు.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 


➥ అభ్యర్థులు తమవెంట రెండు బాల్‌పాయింట్‌ బ్లాక్‌ పెన్నులు, హాల్‌టికెట్‌ తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులు ఓఎమ్మార్‌ షీట్‌లోని గడులను బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. ఆఖరుకు బ్లూ కలర్‌ పెన్ను వాడినా అంగీకరించరు. 


➥ మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులులోనికి అనుమతించబడవని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.


➥ పరీక్ష ముగిశాకే అభ్యర్థులను బయటికి పంపుతారని తెలిపారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే యాక్ట్‌ 25/97 ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణకు ఉన్నతాధికారులను పరిశీలకులుగా నియమించారు. 


➥ ఓఎంఆర్‌ షీట్‌ను మలవకూడదని, ఎలాంటి పిన్నులు కొట్టకూడదని సూచించారు. ఆన్సర్‌ పెట్టేటప్పుడు ఓఎంఆర్‌ షీట్‌పైన ఉండే సర్కిల్‌ను పూర్తిగా షేడ్‌ చేస్తేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారని అధికారులు తెలిపారు.


➥ అభ్యర్థులు తమ పేరులో ఏమైనా స్వల్ప అక్షర దోషాలు, వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫోటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.


➥ హాల్‌టికెట్‌పైన ఫోటో, సంతకం సరిగా లేకపోతే ఫోటోను అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించుకొని, తమ ఆధార్‌ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోలను సంప్రదించాలి. డీఈవో అనుమతితో పరీక్షకు అనుమతిస్తారు.


విద్యాసంస్థలకు సెలవులు….
సెప్టెంబరు 15న టెట్‌ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. సెప్టెంబరు 15న పూర్తి సెలవు ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ బుధవారం (సెప్టెంబరు 13న) నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌ బోర్డు సైతం సెలవులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఈ ఏడాది ఆగస్టు 1న విడుదలవగా, ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ: తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


ALSO READ: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..