తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ) నాలుగు పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాలకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ఈ మెటీరియల్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే బుకింగ్స్ మొదలయ్యాయి. వర్సిటీ అధికారులు నాలుగు పుస్తకాల ధరను రూ. 1,150గా నిర్ణయించారు.
ఈ పుస్తకాల ఆన్‌లైన్ బుకింగ్‌ను ఆగస్టు 29న ప్రారంభించగా, తొలిరోజు 500 మంది అభ్యర్థులు బుక్ చేసుకొన్నారు. మొత్తం 2,200 పేజీలు ఉన్న ఈ మెటీరియల్‌ను జిరాక్స్ తీస్తే రూ.2వేలకు పైగా ఖర్చవుతుంది. కానీ వర్సిటీ అధికారులు అతి తక్కువకే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తెచ్చారు. తొలివిడతగా 20వేల పుస్తకాలను ముద్రించారు. వీటిలో కొన్ని గ్రంథాలయాలకు అందించగా, మరికొన్నింటిని వర్సిటీలోనే విక్రయిస్తున్నారు.
బీఏ, ఎంఏ పుస్తకాలకు ఎక్కువ డిమాండ్ నెలకొన్నది. వీటిని మార్కెట్లో విక్రయించరు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. ఈ పుస్తకాలు సివిల్స్‌కు పోటీపడే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పూర్వ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మెటీరియల్ రూపకల్పన కమిటీ చైర్మన్‌గా ఉండి అన్ని అంశాలను క్రోడీకరించి, పుస్తకాలను తయారుచేయించారు.
పుస్తకాలు ఇవే..
1) తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవతరణ
2) ఆర్థిక వ్యవస్థ -అభివృద్ధి
3) భారత సమాజం – రాజ్యాంగ పరిపాలన
4) భారతదేశ చరిత్ర – సంస్కృతి
ఇలా బుక్ చేసుకోండి..
1. మెటీరియల్ కావాలనుకొనే అభ్యర్థులు మొదట www.braouonline.inలో పేమెంట్ చేయాలి.
2. ఆ తర్వాత వచ్చిన పేమెంట్ రశీదుతో వర్సిటీకి వెళ్లి మెటీరియల్ పొందవచ్చు.
3. పోస్టు ద్వారా పొందాలనుకొనేవారు https://www.braouonline.in/BooksSale/ServicesBooks.aspx లింక్ ద్వారా సంప్రదించాలి.
4. వర్సిటీ కౌంటర్‌లోనూ డబ్బులు చెల్లించి వెంటనే మెటీరియల్ పొందవచ్చు.
5. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకొంటే, పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆగస్టు 27న విడుదల చేశారు. మొత్తం నాలుగు రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 125 మంది ప్రొఫెసర్లు ఈ పుస్తకాలను రూపొందించడంలో అహర్నిశలు పనిచేశారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పోటీ పరీక్షల పుస్తకాలు వెలువడటం గురించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి స్పందించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. టీఎస్‌పీఎస్సీ సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలను రూపొందించారని తెలిపారు.
Also Read:
TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2910 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. 663 గ్రూప్-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని దాటేశామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఇచ్చిన హామీ మేరకు గడిచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు.
పూర్తి వివరాలు జీవోల కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణలో ఆగస్టు 28న నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 'కీ'ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. దీంతో మార్కులపై ఓ అంచనాకు రావొచ్చు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కీపై ఏమైనా సందేహాలుంటే ఆగస్టు 31న ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కాగా, అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..