భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మరో సంచలన ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు 11వేల 103 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచే వారసత్వంగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల అంశం వచ్చిందని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ రంగ సంస్థలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. మొదట్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని భావించినప్పటికీ కొన్ని పార్టీలు కోర్టుల్లో కేసులు వేసి మోకాలు అడ్డాయని ఆరోపించారు. వాటిన్నింటిని న్యాయస్థానాలు కొట్టివేసి కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యులరైజ్ కోసం అనుమతి ఇచ్చాయని.సభకు తెలిపారు. డిసెంబర్ 7న హైకోర్టు ఈ కేసుల్లో కీలక తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు.
ఎప్పటికైనా ఉద్యోగం రెగ్యులరైజ్ చేయకపోతారా అన్న ఆశతో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కొలువల్లో మగ్గిపోయారన్న సీఎం కేసీఆర్.. వాళ్లకు ఇకపై విముక్తి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. వాళ్లను వీలైనంత త్వరగా రెగ్యులరైజ్ చేస్తామని ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలు పంపించినట్టు సభలో ప్రకటించారు.
ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసేందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్ భవిష్యత్‌లో ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగం కనిపించదని మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల బర్తీకి జరగబోదన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలా క్యాలెండర్ విడుదల చేస్తామని దాని ప్రకారమే రెగ్యులర్ పోస్టులు భర్తీ ఉంటుందన్నారు.
జాబ్ క్యాలెండర్ కోసం అన్ని శాఖలు ఖాళీలు పంపించాలని సూచించారు కేసీఆర్. ఎప్పటికప్పుడు వేకెన్సీ అవుతున్న ఖాళీలను గుర్తించి ఆయా నియామక సంస్థలకు పంపించాలన్నారు. ఆయా ఖాళీలకు అనుగుణంగా ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తాయని ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియని శాసనసభలో చెప్పారు సీఎం కేసీఆర్.