Andhra Pradesh DSC 2025 | లేక లేక జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయని సంతోషించేలోపే నిరుద్యోగులకు పెద్ద సమస్య వచ్చి  పడింది. ఒకే సమయంలో మూడు పరీక్షలు నిర్వహిస్తుండటంతో అందులో కొన్ని రోజులు ఈ పరీక్షలు ఒకే తేదీన జరగనున్నాయి. కొన్ని డేట్స్ క్లాష్ అవుతాయని ఏపీ డీఎస్సీ ఎగ్జామ్స్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్, తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ రాయనున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఒకే సమయంలో రెండు ఎగ్జామ్స్ ఉండకూడదని, ప్రిపరేషన్‌కు సమయం చాలదని అభ్యర్థులు భావిస్తుంటారు. అలాంటిది మూడు పరీక్షలు ఒకేసారి రావడంతో కొన్ని రోజులు ఒకేరోజు రెండు పరీక్షలు, లేక మూడు పరీక్షలు సైతం జరగనున్నాయి. దాంతో అభ్యర్థులు ఏదో ఓ పరీక్ష వదులుకోవాల్సి వస్తుంది. అన్ని పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో నోటిఫికేషన్ వచ్చిందన్న సంతోషం కంటే, ఓ ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు.  

ఏపీ డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 5న ప్రారంభమైన ఏపీ డీఎస్సీ ఎగ్జామ్స్ ఈ నెల 30 వరకు జరగనున్నాయి. రోజూ రెండు సెషన్స్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం సెషన్ 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా 5.7 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో కేవలం 3 లక్షలకు పైగా అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఒక్క నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ హాల్ లోకి ఎంట్రీ ఉండదని అధికారులు హెచ్చరించారు.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు అన్నీ కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రభుత్వం దృష్టిలోపం ఉన్నవారికి, రెండు చేతులు లేని దివ్యాంగులు పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేసింది.  పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో 154 కేంద్రాల్లో పరీక్షు జరగనున్నాయి. పరీక్ష కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌, పెన్ను, గుర్తింపు కార్డు మినహా వేరే వస్తువులు తీసుకురావొద్దని అధికారులు సూచిస్తున్నారు.  మెగా డీఎస్సీ పరీక్షలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

జూన్ 18 నుంచి తెలంగాణ టెట్

ఏపీ డీఎస్సీ ఎగ్జామ్స్ జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్నాయి. హైదరాబాద్‌లోనూ ఏపీ డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాన్‌ లోకల్‌ కింద 20 శాతం టీచర్ పోస్టుల కోసం తెలంగాణ నుంచి ఏపీ డీఎస్సీకి దరఖాస్తు చేశారు. యూజీసీ నెట్ (UGC NET 2025) జూన్ 21 నుంచి 30వరకు నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ (TG TET 2025) జూన్ 18 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నారు. 

ఒకే సమయంలో 3 పరీక్షల నిర్వహణతో అభ్యర్థులకు కష్టాలు

పైన వివరాలు గమనిస్తే ఒకే సమయంలో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్ ఉండటం.. ఒకే తేదీల్లోనూ కొన్ని సెషన్ల పరీక్షలు ఉండటంతో ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ముఖ్యంగా మూడు ఎగ్జామ్స్ కోసం చూస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. న్ 20న ఎక్కువ మందికి తెలంగాణలో టెట్‌ పేపర్‌-1 ఉండగా, ఏపీ డీఎస్‌సీకి సంబంధించి ఎస్‌జీటీ పోస్టులకు ఎగ్జామ్స్ ఉండటం అభ్యర్థులకు పరీక్షగా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్రం సైతం ఎగ్జామ్స్ కు ముందుగానే షెడ్యూల్ విడుదల చేయడం ద్వారా మరో ఎగ్జామ్ అదే రోజు నిర్వహించకుండా ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే తాము ఎగ్జామ్ రాయకుండా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఎగ్జామ్స్ టెన్షన్ కన్నా, ఎగ్జామ్ రాస్తామో లేదోనన్న భయం వారిలో పెరుగుతోంది. అభ్యర్థుల సమస్యను అర్థం చేసుకుని ఒకేరోజు ఎగ్జామ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను అభ్యర్థులు కోరుతున్నారు.