APPSC Group-2 Preferences: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ అందించింది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. ఆప్షన్లకు సంబంధించి పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను (Post, Zonal, District Preferences) కమిషన్ అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు జూన్ 5 నుంచి 18 వరకు ప్రాధ్యాన్యాలను ఇచ్చుకోవాలని కోరింది. అభ్యర్థులు గ్రూప్-2కు సంబంధించిన నోటిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలించి.. తమ ప్రాధాన్యాలను ముందుగానే ఒక పేపర్ పై రాసి పెట్టుకుంటే, అప్లోడ్ చేసే సమయంలో సులువుగా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటలో తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 10న విడుదలచేసింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులకు ఎంపికచేసింది. ప్రిలిమ్స్ ఫలితాల ద్వారా మొత్తం 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా.. 2,557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో తిరస్కరించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో జులై 8న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేశారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష కూడా ఆఫ్‌లైన్ మోడ్ (OMR) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..
మొత్తం 300 మార్కులకు గ్రూప్-2 మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఇందులో పేపర్-1 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, భారత రాజ్యాంగం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్-2కు సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు (రెండున్నర గంటలు) కేటాయించారు.