అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో త్వరలోనే తన రిటైల్ స్టోర్లను తెరవబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి దశలో 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. జనవరి 2021లో సంస్థ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ, ఆన్‌లైన్ స్టోర్‌కు దేశంలో అద్భుతమైన స్పందన లభించిందని, కంపెనీ భవిష్యత్తులో దేశంలో రిటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని, వెళ్తున్నామని అని కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారత్‌లో రిటైల్ స్టోర్లకు రూపకల్పన చేసింది.


యాపిల్ ఎప్పటి నుంచో భారత్‌లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో నేరుగా ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ.. ఆఫ్‌లైన్‌లో మాత్రం థర్డ్ పార్టీల స్టోర్ల ద్వారానే ఈ విక్రయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రిటైల్ స్టోర్లు తెరవాలని యాపిల్‌కు ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది.


అమెరికా, చైనాలో ఈ తరహా స్టోర్లు ఉన్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో అత్యధిక షిప్‌మెంట్ షేర్‌ను నమోదు చేయడంతో భారతదేశంలో 40 శాతం వాటాతో ఆపిల్ ప్రీమియం సెగ్మెంట్‌లో ముందుంది, శామ్‌సంగ్ మరియు వన్‌ప్లస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో తమ రిటైల్ స్టోర్లలో పనిచేయడానికి ఉద్యోగులు కావాలంటూ ప్రకటన వెలువరించిందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. 


* భర్తీచేసే పోస్టుల వివరాలు..


➥ టెక్నికల్ స్పెషలిస్ట్


➥ స్టోర్ లీడర్


➥ స్పెషలిస్ట్ సీనియర్ మేనేజర్


➥ ఆపరేటింగ్ ఎక్స్‌పర్ట్


➥ మార్కెట్ లీడర్


➥ మేనేజర్ 


వివిధ హోదాలకు సంబంధించి ఉద్యోగులను యాపిల్‌ను నియమించుకునేందుకు యాపిల్ కెరీర్స్ పేజీలో ప్రకటన వెలువరించింది. తొలుత ఢిల్లీ, ముంబయిలో ఈ స్టోర్లను ప్రారంభించి తర్వాత పుణె, బెంగళూరు వంటి ఇతర నగరాల్లోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు యాపిల్ తన ఐఫోన్ల తయారీని సైతం చైనా నుంచి ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.


రాబోయే రోజుల్లో 50 వేలు, పరోక్షంగా మరో లక్ష ఉద్యోగాలు..
యాపిల్ సంస్థ దేశంలో ఉత్పత్తిదారులు, కాంపోనెంట్ సప్లయర్స్ దేశంలో దాదాపు 50 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టులో అమల్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ ప్రొడక్షన్ లింక్డ్-ఇన్సెంటివ్ (PLI) పథకంలో భాగంగా ఈ ఉద్యోగాలకు అవకాశం కలిగింది. ప్రత్యక్ష ఉద్యోగాలు కాకుండా దేశంలో యాపిల్ సంస్థకు సంబంధించిన సరఫరాదారులు, దాని తయారీదారుల వ్యవస్థ నుంచి దాదాపు లక్ష వరకు పరోక్ష ఉద్యోగాలకు అవకాశం కలిగింది. వీటిలో ఫోక్స్‌కాన్, పెగట్రోన్, విస్ట్రాన్ సంస్థలు ఉన్నాయి. ఇక కంపెనీ కాంపోనెంట్ సరఫరాదారులలో ఫాక్స్ లింక్, అవరీ, సన్‌వోడా, సాల్‌కాంప్ సంస్థలు ఉన్నాయి.   


Also Read:


Blue Grey Collar Jobs: ఉద్యోగం కావాలా! ఈ జాబ్‌ ప్రొఫైల్స్‌కు హైరింగ్‌ ఓ రేంజ్‌లో ఉండబోతోంది!
ఆర్థిక మాంద్యం దెబ్బకు పశ్చిమ దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. భారత్‌లో మాత్రం బ్లూ కాలర్‌, గ్రే కాలర్‌ ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతోంది. 2022లో కంపెనీలు వీరిని నాలుగు రెట్లు ఎక్కువగా నియమించుకున్నాయి. భారీ స్థాయిలో డిజిటైజేషన్‌, ఆటోమేషన్‌, సరికొత్త పని సంస్కృతుల ఆవిర్భావమే ఇందుకు కారణాలని ఉద్యోగ నియామకాల కంపెనీ బిలియన్‌ కెరీర్స్‌ (క్వెస్‌ కార్ప్‌) తెలిపింది. 2023లోనూ వీరికి ఎక్కువ డిమాండ్‌ ఉందని వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..