AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీటెట్, ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్లు ఫిబ్రవరి 5న వెలువడనున్నాయి. ఈరోజు నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా టెట్ పరీక్షల షెడ్యూలును అధికారులు ఖరారుచేయనున్నారు.
ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని తీసుకురానున్నారు. రాత పరీక్షలో ఎంపికైన టీచర్లకు రెండేళ్లపాటు గౌరవవేతనానికి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి స్కేల్ వస్తుంది. కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్, డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. అప్రెంటిస్‌షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్‌షిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఎస్జీటీ పోస్టులు డీఈడీ అభ్యర్థులకే..
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్(SA) పోస్టులకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో పరీక్షలు ఇలా..
గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.
మెగా డీఎస్సీ లేనట్లే..?
గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 771 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబరులో జరిగిన సమావేశాల్లో18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిల్లో 8,366 పోస్టులు మాత్రమే అవసరమని శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే 1,69,642 మంది పని చేస్తున్నట్లు ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ లెక్కన 18 వేలకు పైగా ఖాళీలున్నాయి. మంత్రి బొత్స మాత్రం 8,366 పోస్టులే అవసరమంటున్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం పోస్టుల సర్దుబాటు, వందశాతం పదోన్నతుల సాకుతో ఎత్తేసిందో స్పష్టత లేదు. కాగా తాజాగా కేవలం 6 వేల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది.
మెగా డీఎస్సీ వేయాలని అభ్యర్థుల డిమాండ్..
నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్ విడుదల చేస్తారని స్టడీ సెంటర్లలో ఉంటూ సన్నద్ధం అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు నిరుద్యోగులంతా ఏకమవుతారని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ఏకమై అధికార మార్పడి చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడికి పాటు పడుతామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీని విడుదల చేయకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీపై మంత్రి బొత్స సత్యనారాయణ రోజుకో మాట మాట్లాడుతున్నారని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హేతుబద్దీకరణ పేరుతో 2000 స్కూళ్లను మూసివేసారని 15 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని వారు మండిపడుతున్నారు.తక్షణం మెగా డీఎస్సీ ఇవ్వాలన్నారు. ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.