AP High Court Orders: ఏపీలో పోలీసు ఎస్‌ఐ ఉద్యోగాల ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. దేహదారుఢ్య పరీక్ష(PMT)లో తమకు అన్యాయం జరిగిందని పిటిషన్ వేసిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు(AP High Court) షాకిచ్చింది. ఎత్తు విషయంలో పిటిషనర్లు అర్హులేనంటూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చాలంటూ గుంటూరు ఐజీని న్యాయస్థానం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో వైద్యులు ముగ్గురు అభ్యర్థుల ఎత్తును కొలవగా అనర్హులని తేలింది. దీంతో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా? లేక షరతు ప్రకారం రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లిస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సొమ్ము చెల్లించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.


అభ్యర్థుల తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించారన్నారు. ముగ్గురు అభ్యర్థులతో కొలత ప్రక్రియను ఆపేయవద్దని, మిగిలిన వారికీ నిర్వహించాలని కోరారు. మరోవైపు పిటిషనర్లు ఎత్తు విషయంలో అర్హులేనని ప్రభుత్వ వైద్యులు తాజాగా ధ్రువపత్రాలు ఇచ్చారన్నారు. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మా ముందే నిర్వహించిన పరీక్షలో అర్హత లేదని తేలినా ఎవరో ధ్రువపత్రాలు ఇచ్చిన సంగతి చెబుతారా అని ప్రశ్నించింది. కోర్టుపైనే నింద మోపేందుకు యత్నిస్తున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలపై విచారణ జరపాలని గుంటూరు ఐజీని ఆదేశించింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఫలితాల ప్రకటనను నిలువరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.


19 మంది అభ్యర్థులు హాజరు..
హైకోర్టుకు డిసెంబరు 5న 19 మంది అభ్యర్థులు ఎత్తు కొలత కోసం హాజరయ్యారు. కోర్టు హాలులోనే ముగ్గురు అభ్యర్థుల ఎత్తు కొలిచారు. న్యాయమూర్తులిద్దరూ స్వయంగా దీనిని పరిశీలించారు. బోర్డు చెబుతున్న ఎత్తు, ప్రస్తుతం తీసిన ఎత్తు ఒకే విధంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా లేక కోర్టు షరతుకు కట్టుబడి రూ.లక్ష చొప్పున ఖర్చులు చెల్లిస్తారా? నేరుగా జైలుకు వెళతారా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ గతంలో అర్హత సాధించారన్నారు. తాజాగా ప్రభుత్వ వైద్యులు ధ్రువపత్రాలిచ్చారన్నారు. అందుకే ఎత్తు విషయంలో అర్హులనే విశ్వాసంతో ఉన్నామని నవ్వుతూ బదులిచ్చారు.


హైకోర్టు సీరియస్..
ధర్మాసనం స్పందిస్తూ.. ఇది నవ్వే వ్యవహారమా? ఎంత మంది సమయం వృథా చేశారో చూడండి అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ధ్రువపత్రాలిచ్చిన వైద్యుల వివరాలను సేకరించి విచారణ జరపాలని, ఆ పత్రాల వాస్తవికతను తేల్చాలని గుంటూరు ఐజీని ఆదేశించింది. హైకోర్టు అంటే జోక్ అనుకుంటున్నారా? హైకోర్టు విచారణ ప్రక్రియ అంటే నవ్వులాటగా ఉందా అని మండిపడింది. ఎంపిక ప్రక్రియను జాప్యం చేసినందుకు పిటిషనర్లు ఖర్చులు చెల్లించేందుకు అర్హులని పేర్కొంది. విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది. పోలీసు నియామక బోర్డు తరఫున ప్రభుత్వ న్యాయవాది కిశోర్ కుమార్ వాదనలు వినిపించారు.