AP 1998 DSC Jobs : 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఇటీలవ నిర్ణయించింది. న్యాయపర వివాదాలు పరిష్కారం కావడంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. 1998 అభ్యర్థులకు మినిమం టైమ్ స్కేల్ పేమెంట్ వర్తింపజేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. వీరికి నెలకు రూ.33 వేల వేతనం లభించనుంది. 1998 డీఎస్సీ అభ్యర్థులను డీఈవో పూల్‌లో ఉంచి, అవసరమైన చోట్ల సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీల్లో ఉపాధ్యాయులుగా, సీఆర్‌పీలుగా, మోడల్ స్కూల్స్‌లో గెస్ట్ లెక్చరర్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. సుమారు 23 ఏళ్ల తర్వాత వారిని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినందున ఎంతమంది ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారో వివరాలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. డీఎస్సీ 2008 అభ్యర్థుల తరహాలోనే వీరిని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
23 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలివ్వాలని నిర్ణయించుకుంది. అప్పట్లో అర్హత సాధించిన వారిలో చాలా మందికి ఉద్యోగాలు వివిధ కారణాలతో ఇవ్వలేదు. 23 ఏళ్లుగా వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి ఉద్యోగాలిచ్చే ఫైల్‌పై ఏపీ సీఎం జగన్ సంతకం చేశారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం విధివిధానాలను సిద్ధం చేసింది. గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 1998, 2008 డీఎస్సీ అర్హుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు లబ్ధిచేకూరే అవకాశం ఉంది. అయితే డీఎస్సీ రాసి ఇప్పటికే 23 ఏళ్లు దాటింది. అంటే అభ్యర్థులు పాతికేళ్లకే పరీక్షలు రాసినా యాభై ఏళ్లు వస్తాయి. రిజర్వేషన్ మినహాయింపులతో ముఫ్పై ఏళ్లకు పరీక్షలు రాసిన వారు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి ఉంటారు. అర్హుల్లో ఎంత మంది ఇతర ఉద్యోగాల్లో స్థిరపడకుండా ఉంటారన్నది స్పష్టత లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ డీఎస్సీలో అర్హులైన వారికి ఏదో విధంగా న్యాయం చేయాలని అనుకుంటోంది.
సీఎం జగన్ ను కలిసిన అభ్యర్థులు
1998 డీఎస్సీ అభ్యర్థులు ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలిసి తమ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు చాలా ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. 1998 డీఎస్సీలో వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయామని... ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా తమ సమస్యను పరిష్కరించాలని పాదయాత్రలో జగన్‌కు వీళ్లంతా గోడు వెల్లబోసుకున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. కోర్టు తీర్పునకు అనుగుణంగా 1998 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు.