ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ బాగా తగ్గింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 83.23 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఉప ఎన్నిక కాబట్టి పోల్ పర్సంటేజీ తగ్గుతుందని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే పర్సంటేజీ తగ్గింది. కేవలం 64.26 శాతం నమోదైంది. ఆత్మకూరులో మండలాల వారీగా లెక్కలు తీస్తే.. పోలింగ్ శాతం ఇలా ఉంది. 


మండలం     -    పోల్ పర్సంటేజ్
ఆత్మకూరు    -        63.69
మర్రిపాడు      -       59.73
అనంతసాగరం -    65.12
ఏఎస్ పేట     -       62.57 
సంగం          -         67.27
చేజర్ల           -         67.74


ఆత్మకూరు ఉపఎన్నికల్లో మండలానికో ఇన్‌ చార్జ్ మంత్రిని, ఎమ్మెల్యేని ప్రచార సారథులుగా నియమించారు. మొత్తం 6 మండలాల్లో చేజర్లలో పోల్ పర్సంటేజీ అత్యధికంగా నమోదైంది. ఆ మండలానికి ఇన్ చార్జ్ మంత్రి రోజా. ఇన్ చార్జ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ప్రచారానికి రాకపోయినా రోజా మాత్రం మండలంలో కలియదిరిగారు. ఆమె తమకు అప్పగించిన మండలంతోపాటు.. ఇతర మండలాల్లో కూడా పర్యటించారు, రోడ్ షో లలో పాల్గొన్నారు. మొత్తమ్మీద తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు రోజా. చేజర్ల మండలంలో అత్యథిక పోల్ పర్సంటేజీ తెచ్చి చూపించారు. 


ఇక పర్సంటేజీ అతి తక్కువగా నమోదైన మండలం మర్రిపాడు. మర్రిపాడులో 59.73 పర్సంటేజీ మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇది మేకపాటి సొంత మండలం. ఈ మండలంలోని బ్రాహ్మణ పల్లి మేకపాటి సొంత ఊరు. మేకపాటి కుటుంబం సొంత మండలంలోనే పోలింగ్ పర్సంటేజీ తక్కువగా నమోదు కావడం విశేషం. మర్రిపాడు మండలానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఇన్ చార్జ్ గా ఉంటూ ప్రచారం చేపట్టారు. అయినా ఇక్కడ పోలింగ్ పర్సంటేజీ తగ్గింది. ఆత్మకూరు రూరల్ ప్రాంతంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తోపుదుర్తి ప్రకాష్.. పోల్ పర్సంటేజ్ ని పెంచగలిగారు. ఇక్కడ వైసీపీ ఇన్ చార్జ్ జితేంద్ర రెడ్డి, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి.. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ముఖ్య కారకులు. మొత్తమ్మీద అనుకున్నదానికంటే తక్కువ పోలింగ్ నమోదైనా.. మండలాల వారీగా లెక్క తీసుకుంటే.. ఆత్మకూరు రూరల్, చేజర్లలో పోలింగ్ పర్సంటేజీ బాగా వచ్చింది. 


పర్సంటేజీ తగ్గడంతో అధికార పార్టీ అంచనా వేసిన లక్ష మెజార్టీ అనేది సాధ్యం కాకపోవచ్చనే అంచనాలున్నాయి. బీజేపీకి వచ్చే ఓట్లను బట్టి ఇక్కడ మెజార్టీ లెక్కలు మారిపోతాయి. ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశముంది. ఈనెల 26న కౌంటింగ్ జరుగుతుంది. ఉప ఎన్నిక ఫలితాలు వెలువడతాయి.