AP DSC 2026 Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని భావించే లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కబురు రానే వచ్చింది. డీఎస్సీకి సంబంధించిన వివరాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. టెట్ ప్రారంభం రోజునే అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ డీఎస్సీకి రాబోతోందని స్పష్టం చేశారు. ఎన్ని పోస్టులు అనేది చెప్పకపోయినా నోటిఫికేషన్ ఎప్పుడు, పరీక్ష ఏ నెలలో పెడతారనే విషయంపై కార్లిటీ ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హ పరీక్ష టెట్ ప్రారంభమైంది. ప్రభుత్వం పాఠశాలల్లో టీచర్ పోస్టు సాధించాలనే లక్ష్యానికి ఇదో మెట్టు. ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వివిధ కేంద్రాల్లో డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి ఈ కీలక ఘట్టం ప్రారంభమైన తరుణంలో పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులకు ధైర్యం చెబుతూనే భవిష్యత్ నియామక ప్రక్రియ గురించి తెలియజేశారు.
పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి, మానసిక ఆందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కావాలనే యువత కలలను నెరవేర్చే దిశా ఈ టెట్ ఒక చారిత్రాత్మక మలుపు అని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌పై నమ్మకంతో ప్రతికూల ఆలోచనలకు తావులేకుండా పరీక్షా హాల్‌లోకి అడుగు పెట్టాలని సూచించారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భరోసా ఇచ్చారు.
నిఘా నీడలో టెట్
పరీక్షల నిర్వహణలో విశ్వసనీయతను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ అత్యాధునిక సాంకేతికతను వాడుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో నిబంధనలు కఠిన తరం చేశారు. ప్రతి అభ్యర్థిని బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాలకు అమరావతిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. ప్రతి నిమిషం అక్కడ జరిగే పరిణామాలను లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించారు. సెంటర్లకు చేరుకోవడానికి రవాణా శాఖ ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించడంతోపాటు, సందేహాల నివృత్తికి జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు
టెట్ రాస్తున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్, ఓటర్ ఐడీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
అక్టోబర్‌లో డీఎస్సీ, డిసెంబర్‌లో ఎగ్జామ్
కేవలం టెట్ నిర్వహణతోనే సరిపెట్టకుండా, డీఎస్సీ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2026 డీఎస్సీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ అక్టోబర్‌లో విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నెల రోజుల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత నెల రోజులకు పరీక్ష పెడతారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే అంటే డిసెంబర్ నెలలోనే డీఎస్సీ పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు.
టెట్ ముగిసిన తర్వాత అభ్యర్థులు మరింత ఉత్సాహంతో డీఎస్సీకి సన్నద్దం కావాలని మంత్రి నారా లోకేష్ ఈ ప్రకటన జారీ చేశారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు.
