AP DSC: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఏపీలో డీఎస్సీ-2024 పరీక్షల నిర్వహణపై ఉన్న సందిగ్ధతకు ఎన్నికల సంఘం తెరదించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మార్చి 30న ఆదేశించారు. అదేవిధంగా ఏపీ టెట్ ఫలితాల వెల్లడిని కూడా వాయిదా వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నిల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఆ రెండు అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.
డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని, డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామని, ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదావేసినట్లు విద్యాశాఖ మార్చి 29న ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల తర్వాతే పరీక్షల కొత్త తేదీలను (రివైజ్డ్ షెడ్యూలు) ప్రకటించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అదేవిధంగా పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు కొత్త షెడ్యూలు ప్రకారం అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.
ఏపీలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించారు. అయితే ఏపీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇది తమ పరిధిలో ఉండదని.. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తే వాయిదా వేస్తామని అభ్యర్థులకు తెలిపింది. అయితే తాజాగా ఈసీ నుంచి ఆదేశాలు వెలువడటంతో డీఎస్సీ పరీక్షలు వాయిదాపడ్డాయి.
ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాసేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 23 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు పేపర్-1 పరీక్షలు నిర్వహించారు. మార్చి 6 వరకు ఏపీ టెట్ 2024 పరీక్షలు నిర్వహించారు. అనంతరం టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేశారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరించారు. అనంతరం మార్చి 14న ఫైనల్ కీని విడుదల చేసింది. ఏపీ టెట్ 2024 తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 13న టెట్ తుది ఫలితాలు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా.. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఫలితాలు వాయిదాపడ్డాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న విషయం విదితమే.