Amazon Lay off: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిని సాగనంపిన సంగతి తెలిసిందే. ఇపుడు వీరిబాటలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అయిన అమెజాన్ పయనిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతోంది. ఈ వారంలోనే ఉద్యోగుల తొలగింపు చేపట్టనుంది.


ఇదే కారణం.. 
అమెజాన్ అమ్మకాలు మందగించడంతో, ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించాలని సంస్థ నిర్ణయించింది. ఒక్క అమెజాన్ మాత్రమే కాదు, దిగ్గజ కంపెనీలు చాలా వరకు వ్యయ నియంత్రణ కోసం ఉద్యోగులను తొలిగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఆర్దిక మాంద్యం దిశగా పయనిస్తూ ఉండటంతో, దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్ద కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడం ప్రారంభించాయి.


1 శాతం ఉద్యోగులు బయటికే.. 
2021 సెంబర్ 31 నాటికి అమెజాన్‌లో దాదాపు 1,608,000 ఫుల్‌టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతనెల్లోనే అమెజాన్ సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అమెజాన్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తే, ఇది అమెజాన్ చరిత్రలో అతిపెద్ద తొలగింపు అవుతుంది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్లకు పైగా ఉద్యోగుల్లో 10 వేల మంది అంటే, కంపెనీ కేవలం 1 శాతం ఉద్యోగులను మాత్రమే తొలగించబోతోంది.


అసాధారణ పరిస్థితి నేపథ్యంలో..
అమెరికా, యూరప్ వంటి అనేక పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు లాభనష్టాల ఊగిసలాటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిప్రభావం పెద్ద కంపెనీల జాబ్ మార్కెట్‌పై ప్రత్యక్షంగానే ప్రభావం చూపుతోంది. దీంతో ఉద్యోగుల తొలగింపు అనివార్యమని కంపెనీలు భావిస్తున్నాయి.


అమెజాన్ ఏం చెబుతోంది..?
ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ తన కార్యకలాపాల్లో రోబోల వినియోగాన్ని పెంచుతోంది. ప్రస్తుతం, అమెజాన్ డెలివరీ చేసిన ప్యాకెట్లలో 3 వంతులు కొన్ని రోబోటిక్ సిస్టమ్ ద్వారానే జరగుతున్నాయి. ఈ విషయమై అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టై బ్రాడీ మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్లలో ప్యాకేజింగ్‌లో 100% రోబోటిక్ సిస్టమ్ ఉండవచ్చని అంటున్నారు. మానవ కార్మికుల స్థానంలో ఈ రోబోలు ఎంత త్వరగా వస్తాయో ఇప్పుడే చెప్పలేం. పని విధానంలో అయితే తప్పకుండా మారబోతుందని, అయితే మనిషి అవసరం మాత్రం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.


మెటాలో 13 శాతం ఉద్యోగాల తొలగింపు..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా తాజాగా 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కంపెనీ నుంచి తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల పాటు వేతనం ఇవ్వనుంది సంస్థ. ఇంకా కంపెనీలో పని చేసిన సమయానికి సంవత్సరానికి రెండు వారాల చొప్పున అదనపు వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించింది సంస్థ.


మరోబాంబు పేల్చిన మస్క్..
ఇటీవల ట్విట్టర్ టేకోవర్ తర్వాత కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిని తొలగిస్తూ ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచం మరిచిపోక ముందే మరోసారి ఉద్యోగుల లేఆఫ్ ప్రకటించారు. ఇప్పటికే హఠాత్తుగా ఉద్యోగాలను కోల్పోయిన అనేకమంది కన్నీటి గాథలు మరువక ముందే మరో బాంబు పేల్చారు. 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కనీసం నోటిసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.