World Health Day 2023: ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మెరుగైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు.
మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి, మిమ్మల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే వివిధ రకాల ఆహారాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో 10 ఉత్తమ ఆహారాలు ఇవే.
వెల్లుల్లి
వెల్లుల్లి దాదాపు ప్రతి వంటగదిలో ఉంటుంది. ఇది వంటలకు మంచి రుచి, సువాసన ఇస్తుంది. దీనిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో అత్యంత శక్తిమంతమైన అల్లిసిన్ అనే కాంపౌడ్ ఉంది. దీని కారణంగా, వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి. వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు.
అల్లం
అల్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి అల్లం మేలు చేస్తుంది. రోజు అల్లం కషాయం తాగుతున్నా లేదా అల్లం రసాన్ని పరగడుపునే తీసుకుంటున్నా.. ఆయా సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణం అల్లంలో ఉంది. కనుక అల్లం రసాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో పరగడుపునే సేవించాలి. దీంతో శరీరంలోని వ్యర్థాలు మొత్తం బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచే గుణం అల్లానికి ఉంది. ఇక చిన్నముక్క అల్లం రోజూ తీసుకుంటే రక్త సరఫరా మెరుగుపడి హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.
పెరుగు
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పెరుగులో కాల్షియం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. పెరుగు, ఎండుద్రాక్ష కలిపి తింటే శరీరానికి ఇ, ఎ, సి, బీ 2, బీ12 విటమిన్లతోపాటు కెరోటోనాయిడ్స్ అందుతాయి.
సిట్రస్ పండ్లు
ద్రాక్ష, నిమ్మ, నారింజ వంటి పండ్లలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరంలో తెల్ల రక్త కణాలు మరియు యాంటీబాడీల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్-సి సమృద్ధిగా లభించటంవల్ల చిగుళ్లు, దంతాల ఆరోగ్యానికి మంచిది. ఈ సిట్రిక్ ఆమ్లం దంతాలపై పేరుకున్న జిగురుపొరను తొలగించి పళ్లు మిలమిలా మెరిసిపోయేలా చేస్తుంది. కొన్ని రకాల పండ్లను తినడం వల్ల ముందరి పళ్లకు, బాగా నమలడం వల్ల పక్క దంతాలకు మంచి వ్యాయామం అందుతుంది. ఫలితంగా చిగుళ్ల వ్యాధులు, దంతక్షయాలను నివారించవచ్చు.
పాలకూర
పాలకూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ రోగనిరోధక వ్యవస్థకు మంచివి. పాలకూర తింటే చర్మం అందంగా తయారవుతుంది. ఇందులోని మెగ్నీషియం, ఐరన్ జుట్టు రాలిపోకుండా చేస్తాయి. వెంట్రుకలు చిట్లడమూ తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు సహకరించే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పాలకూరలో కావల్సినంత ఫోలేట్ లభిస్తుంది. ఫలితంగా మెదడు ఎదుగుదల, పనితీరు మెరుగవుతాయి. అల్జీమర్స్ ప్రమాదాన్నీ తగ్గిస్తుంది.
బాదం
బాదంపప్పులో అధిక మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదంలో ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. ఇందులో మాంసకృత్తులు కూడా ఎక్కువే. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా బాదం తినడం ద్వారా శరీరానికి లభిస్తాయి.
పసుపు
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లలో అధికంగా ఉంటుంది.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.
షెల్ఫిష్
నత్తలు, పీతలు, ఎండ్రకాయలు వంటి పైపెంకు ఉండే సముద్ర జీవుల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు