Type 2 diabetes: డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తోంది. ఈ వ్యాధి కారణంగా, శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. మధుమేహాన్ని నియంత్రించడానికి, మీరు మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి వృద్ధులలో సాధారణం, కానీ ఇప్పుడు పిల్లలు కూడా డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1990 సంవత్సరంతో పోల్చితే, 2019 సంవత్సరంలో 10 నుంచి 14 సంవత్సరాల పిల్లలలో డయాబెటిస్ కేసులు 52.06 శాతం పెరిగాయి. 1 నుంచి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 30.52 శాతం పెరిగాయి. భారత్‌లో డయాబెటిస్ కారణంగా మరణించే పిల్లల సంఖ్య కూడా 1.86 శాతం పెరిగింది.


అయితే ఎక్కువ మంది పిల్లలు టైప్ 2 డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా స్కూళ్లకు లంచ్ బాక్స్ తీసుకురావడం మానేసి జంక్ ఫుడ్ తీసుకొచ్చి తింటున్నారని, ఇది డయాబెటిస్  ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పిల్లలను ఎందుకు ఎటాక్ చేస్తోంది?


మారుతున్న అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ పరిణామాలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల లంచ్ బాక్స్‌కు బదులుగా డబ్బులు ఇస్తున్నారు. దీంతో వారు తమకు నచ్చిన ఆహారాన్ని కొనుగోలు చేసుకుని తింటున్నారు. మరోవైపు పిల్లలు చదువుల్లో బాగా రాణించాలనే ఉద్దేశంతో చిన్న వయస్సు నుంచే ఒత్తిడి తెస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ లక్ష్యాలు ఇస్తున్నారు. ఇక 10వ తరగతిలో ఒత్తిడి మరింత తీవ్రంగా ఉంటుంది.


భయపెడుతోన్న ICMR డేటా


పిల్లల్లో డయాబెటిస్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలావరకు డయాబెటిస్ కేసులు కుటుంబం నుంచి వారసత్వంగా వస్తుంటాయి. ఎక్కువగా 17 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. తాజాగా విడుదలైన ICMR డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ జనాభాలో వయస్సుతో సంబంధం లేకుండా 18 శాతం మందికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. వీరంతా ప్రీ-డయాబెటిస్ విభాగంలోకే వస్తారు. వారు ఇప్పటికీ డయాబెటిస్‌కు గురికాకుండా తమని తాము కాపాడుకోగలరు. ఇందుకు వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది.


ఇది మన బాధ్యత


డయాబెటిస్ రాకుండా ఉండాంటే రోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. డైట్‌ చార్ట్‌ని మెయింటైన్‌ చేసి శరీరానికి ఏది మంచిదో అదే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పెద్దలు.. తమ పిల్లలు జంక్ ఫుడ్ రుచికి అలవాటు పడకుండా జాగ్రత్తపడాలని తెలుపుతున్నారు. జంక్ ఫుడ్ క్రమేనా ఊబకాయానికి కారణం అవుతుందని, అది డయాబెటిస్‌ వ్యాధికి కారణం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నట్లయితే.. తప్పకుండా తీపికి దూరంగా ఉండాలని తెలుపుతున్నారు.


Also Read : రోజుకు రెండు ఏలకులు బుగ్గన పెట్టుకుంటే, డాక్టర్‌తో పనే ఉండదట - ఎందుకో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply