ఈ మ‌ధ్య జ్వ‌రం పేరు చెబితే చాలు జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. అది వైర‌ల్ ఫీవ‌రా, డెంగీనా, టైఫాయిడా, మ‌లేరియానా లేదా కరోనా వచ్చేసిందా అని హడలిపోతున్నారు. ర‌క‌ర‌కాల ఫీవ‌ర్ల‌కు ర‌క‌ర‌కాల టెస్టులు చేయించుకుంటున్నారు. జ్వ‌ర‌మేదైనా స‌రే ప్లేట్ లెట్స్ త‌గ్గిపోతున్నాయి. ర‌క్త‌క‌ణాల సంఖ్య త‌గ్గిపోతే శ‌రీరం మ‌రింత బ‌ల‌హీన‌ప‌డి ఇంకా ఇన్ఫెక్ష‌న్ అధిక‌మ‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. అందునా జ్వ‌రం వ‌స్తే డాక్ట‌ర్ కిచిడీ, ఇడ్లీ ఇలాంటి ఆహారాన్ని తీసుకోమ‌ని చెబుతారు. కానీ అస‌లు నోటికి రుచే ఉండ‌దు క‌నుక చాలా మంది ఆహారం తీసుకోకుండా స‌మ‌స్య‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేసుకుంటారు. అలా కాకుండా జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా కొన్నిర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మ‌న డైట్ లో భాగంగా చేసుకుంటే త్వ‌ర‌గా జ్వ‌రం నుంచి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహార ప‌దార్థాలేంటో చూసేయండి.


చికెన్ సూప్ 


చాలామంది జ్వ‌రం రాగానే నాన్ వెజ్ తింటే త్వ‌ర‌గా త‌గ్గ‌ద‌ని అనుకుంటుంటారు. కానీ చికెన్ సూప్ జ్వ‌రానికి చాలా బాగా ప‌నిచేస్తుంది. అందునా దీన్ని వేడివేడిగా తాగితే నోటికి రుచికూడా వ‌స్తుంది. ఇందులో విట‌మిన్లు, క్యాల‌రీలు, మిన‌ర‌ల్స్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే సోడియం శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్లను పెంచుతుంది. అందువ‌ల్ల ఈ చికెన్ సూప్ తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన న్యూట్రిషియ‌న్లు స‌రిగ్గా అంది శ‌రీరంలో నీటిస్థాయిలు స‌మ‌తౌల్యం అవుతాయి. .అందువ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి త‌గ్గిపోతుంది. అంటే జ్వ‌రం త‌గ్గుతుంద‌న్న‌మాట‌. అంతేకాదు శ‌రీరంలో ఏవైనా ఇన్ఫెక్ష‌న్ల‌కు సంబంధించిన ట్యాక్సిన్లు ఉంటే వాటిని కూడా నివారిస్తుంది. 


ఆకుకూర‌లు


సాధార‌ణంగానే కాయ‌కూర‌లు ఇష్ట‌ప‌డిన‌ట్లు చాలామంది ఆకుకూర‌లను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. డాక్ట‌ర్లు రెగ్యుల‌ర్ డైట్ లో భాగంగా చేసుకోమ‌న్నా లైట్ తీసుకుంటారు.  ఇక జ్వ‌రం వ‌స్తే చెప్పాల్సిన అవ‌స‌రం ఉందా, అస‌లే తిన‌రు. కానీ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా పాల‌కూర‌, తోట‌కూర‌, మున‌గాకు ఇలాంటి ఆకుకూర‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూర‌ల్లో ఫైబ‌ర్, వివిధ ర‌కాల న్యూట్రిషియ‌న్స్ అధికంగా ఉంటాయి. ఇవి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు తింటే వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించి జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గేలా చేస్తాయి.


కిచిడీ


అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌తో, ప‌ప్పుతో చేసిన కిచిడీ మామూలుగా ఉన్న‌ప్పుడు తింటారేమో కానీ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు తిన‌డానికి రుచిగా అనిపించ‌దు. కానీ కిచిడీ తేలిక‌గా జీర్ణం అయ్యే ఆహారం. అందునా అందులో అన్నిర‌కాల కాయ‌గూర‌ల‌ను వేస్తాం కాబ‌ట్టి ఆరోగ్యానికి అన్నిర‌కాల పోష‌కాలు అందుతాయి. మీకు రుచిగా అనిపించ‌లేద‌నుకోండి ఏ పెరుగో, నిమ్మ‌కాయ ప‌చ్చ‌డో వేసుకుని తినేయండి. కేవ‌లం కిచిడీ మాత్ర‌మే కాదు జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఇడ్లీ, పెరుగ‌న్నం లాంటి తేలిక‌గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటే మంచిది. 


పండ్లు


జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఆ పండు తిన‌కూడ‌దు, ఈ పండు తిన‌కూడ‌దు అని చాలామంది పండ్ల‌ను దూరం పెట్టేస్తుంటారు. కానీ పండ్లు తిన‌డం చాలా మంచిది. ముఖ్యంగా విట‌మిన్-C ఉన్న పండ్లు అంటే బ‌త్తాయి, నారింజ‌, ద్రాక్ష‌, యాపిల్, కివి, దానిమ్మ ఇలాంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల జ్వ‌రం తొంద‌ర‌గా త‌గ్గిపోతుంది. 


కొబ్బ‌రినీళ్లు


శ‌రీరంలో వేడి అధిక‌మైన‌ప్పుడు మ‌న‌కు జ్వ‌రం వ‌స్తుంది. దాన్ని త‌గ్గించాలంటే చ‌లువ చేసేలా ఎక్కువ నీటికి సంబంధించిన ప‌దార్థాల‌ను తీసుకోవాలి. కాబ‌ట్టి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు నోరు రుచిగా ఉండ‌దు. నీరు ఎక్కువ తాగాలంటే కొంచెం క‌ష్ట‌మే. అలాంట‌ప్పుడు కొబ్బ‌రినీళ్లు చాలా బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూసుకుంటాయి. కొబ్బ‌రినీళ్ల‌లో ర‌క‌ర‌కాల న్యూట్రిషియ‌న్లు ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఇన్ఫెక్ష‌న్ల‌తో పోరాడి, శ‌రీరాన్ని కూల్ చేసి, జ్వ‌రం త‌గ్గేలా చేస్తాయి. 




Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!