కొవిడ్ నిబంధనలను పాటించకుంటే మన దేశంలో అక్టోబర్- నవంబర్ నెలల్లో కరోనా మూడో వేవ్ పీక్ స్టేజ్ లో చేరుకొనే అవకాశం ఉందని ప్రభుత్వ కమిటీలోని శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. అయితే, రెండో విడత కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న సమయంలో నమోదైన కేసులతో పోల్చితే ఈ దశలో కేసులు 50 శాతమే ఉండొచ్చని అంచనా వేశారు. తీవ్ర ప్రభావం చూపగల వైరస్ రకమేదైనా కొత్తగా వస్తే మూడో విడత కరోనా వ్యాప్తి వేగం పుంజుకోవచ్చని తెలిపారు.
శాస్త్ర సాంకేతిక విభాగం(డీఎస్టీ) నియమించిన కమిటీ.. కొవిడ్-19 వ్యాప్తిపై గణాంకాల 'ఆధారిత సూత్ర నమూనా'ను రూపొందించింది. ఈ కమిటీలో భాగస్వామి అయిన మణింద్ర అగర్వాల్ మూడో దశ విజృంభణకున్న అవకాశాలను విశ్లేషిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇమ్యూనిటీ, టీకాల ప్రభావం, కొత్త వైరస్ రకం ఆవిర్భావం... అనే అంశాలు మూడో దశ వ్యాప్తిలో కీలకమైనవిగా మణింద్ర అగర్వాల్ పేర్కొన్నారు. రెండో విడత విజృంభణ ఆగస్టు రెండో వారానికి ముగిసిపోతుందని తెలిపారు. వ్యాధి నిరోధకత తగ్గి, అనుకున్నంత వేగంగా టీకా కార్యక్రమం జరగకపోతే అక్టోబరు-నవంబరులోనే మూడో దశ పీక్ స్జేజికి చేరుకుంటుందన్నారు. అయితే, ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండవచ్చని కమిటీలో సభ్యుడు, హైదరాబాద్ ఐఐటీ శాస్త్రవేత్త ఎం.విద్యాసాగర్ అంచనా వేశారు.
తీవ్రంగానే..
కొవిడ్-19 రెండో దశ లానే మూడో దశ పరిణామాలూ తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. టీకాలు శరవేగంగా వేయడంతో పాటు వైద్య వసతులు మెరుగు పడితే మరణాల సంఖ్య మాత్రం తగ్గొచ్చని విశ్లేషించింది. కొవిడ్ రెండోదశ తీవ్రత అదుపులోకి వస్తోందని, దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. మూడో దశకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అందరికీ టీకాలు వేయడం, వైద్య మౌలిక వసతులను మెరుగు పరచడం ద్వారా కొవిడ్-19 మూడో దశ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకునే వీలుంటుందని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది.
కొవిడ్-19 విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో రెండో దశ సగటున 108 రోజులు, మూడో దశ 98 రోజుల పాటు ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే.. మూడో దశ కూడా రెండో దశ స్థాయిలో తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. 'ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యే కేసుల సంఖ్యను పరిమితం చేసుకునే వీలుంటుంది. తద్వారా మరణాల సంఖ్య తగ్గుతుంద'ని పేర్కొంది.