కొంతమంది సెకన్లలో గాఢ నిద్రలోకి జారుకుంటారు. మరికొందరు మాత్రం గంటలు గడుస్తున్నా నిద్రపోయేందుకు కష్టపడతారు. అలాంటివారు ఎక్కువగా ఆశ్రయించేది నిద్ర మాత్రలే.  కానీ సహజంగా నిద్రపట్టేలా చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించరు. ప్రతి మనిషికి ఒక రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అప్పుడే శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి, మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. నిద్ర తగ్గితే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దాడి చేయవచ్చు.


నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటివి మానసికపరమైన కారణాలు.  అయితే అధిక కాఫీ తీసుకోవడం, ఆకలితో పడుకోవడం, జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటివి శారీరక కారణాలుగా చెప్పుకోవచ్చు. నిద్రలేమికి కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి చికిత్స చేసుకుంటే నిద్ర సహజంగానే వస్తుంది. అలా కాకుండా నిద్ర మాత్రల వాడకాన్ని మొదలుపెడితే అవి శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. 


ఈ ప్రభావాలు తప్పవు
నిద్ర పట్టడం లేదని వైద్యుల వద్దకు వెళితే ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోమని సూచిస్తారు. కానీ ఎక్కువమంది తమ లైఫ్ స్టైల్ ను మార్చుకోవడానికి ఇష్టపడరు. తద్వారా స్లీపింగ్ మాత్రలు వైద్యులచే రాయించుకుంటారు. అయితే వాటికి అలవాటు పడినవారు సహజంగా నిద్రకు దూరం అవుతారు.  నిద్ర మాత్రలు వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఎలా ఉంటాయంటే తల తిరగడం, గందరగోళంగా అనిపించడం, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, జుట్టు రాలిపోవడం, మెరుగ్గా ఆలోచించ లేకపోవడం వంటివి కలుగుతాయి.  కాబట్టి నిద్ర మాత్రలను పక్కనపెట్టి సహజంగా నిద్రపట్టే పట్టేందుకు సహకరించే పద్ధతులను పాటించాలి.


ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం, యోగా వంటివి రోజూ చేయాలి. మానసిక వైద్యులను సంప్రదించి బిహేవియరల్ థెరపీని పొందాలి. వీటివల్ల నిద్ర సమస్యలు తగ్గే అవకాశం ఉంది. 


నిద్ర మాత్రలు వాడేవారు ఎక్కువగా పగటిపూట కూడా మగతగా ఉండే అవకాశం ఉంది.  కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద రద్దీ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ నిద్ర మాత్రల వాడకాన్ని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా నిద్ర సహజంగా పట్టేలా చూసుకోండి. 


నిద్ర పట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎన్ని సమస్యలున్నా రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఆ సమస్యలను మర్చిపోయి హాయిగా నిద్రపోవాలి. అలాగే నిద్రను పెంచే ఆహారాలను వైద్యులను సంప్రదించి వాటిని మెనూలో చేర్చుకోవాలి.




Also read: డబ్బుతో ఆనందాన్ని కొనలేం అన్నది పచ్చి అబద్ధం అంటున్న అధ్యయనం




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.