గురకను కొంతమంది గాఢ నిద్రకు చిహ్నంగా భావిస్తే, మరికొందరు దాన్ని పెద్ద సమస్యగా భావిస్తారు. నిద్రపోతున్న వ్యక్తికి గురకవల్ల సమస్య ఉన్నా, లేకపోయినా వారి పక్కన ఉండే వారికి మాత్రం చాలా ఇబ్బంది. ఆ గురక శబ్దానికి నిద్ర పట్టక ఎంతో చికాకు పడతారు. గురక అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి కచ్చితంగా గురక వస్తుంది. గురకను తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ అది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం అని చెప్పవచ్చు. వీలైనంతవరకు గురకకు వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమస్యను అధిగమించడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురక నుండి త్వరగా విముక్తి ప్రసాదించే ఆహారాలు ఇవన్నీ. మీ మెనూలో వీటిని చేర్చుకోవడం అవసరం.


తేనె 
పరగడుపున తేనె తాగడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం. రుచిలో అద్భుతంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అధికం. దీనిని శీతాకాలంలో తీసుకుంటే జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ల బారిన కూడా త్వరగా పడరు. నాసిక మార్గాన్ని మూసుకుపోకుండా కాపాడుతుంది, కాబట్టి శ్వాస తీసుకోవడంలో సమస్య ఉండదు. తద్వారా గురక వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగాలి.


పసుపు
ఆయుర్వేదంలో అనేక సమస్యలకు ఔషధంగా పసుపును ఉపయోగిస్తారు. గురక చికిత్సకు పసుపు ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మూసుకుపోయిన ముక్కును తెరవడంలో సాయపడతాయి. పసుపు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కాబట్టి గురక సమస్య నుండి ఉపశమనం దొరుకుతుంది. రాత్రి పడుకునే ముందు పాలల్లో పసుపు వేసి తీసుకోండి.


ఉల్లిపాయ
గురక చికిత్సలో ఉల్లిపాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం. బ్యాక్టీరియాల ద్వారా కలిగే ఇన్ఫెక్షన్లతో ఇది పోరాడుతుంది. అలాగే ముక్కును, గొంతును శుభ్రంగా ఉంచుతుంది. ఉల్లిపాయలు అధికంగా తింటే గురక నుండి విముక్తి పొందవచ్చు. రాత్రి భోజనంలో ఉడికించిన ఉల్లిపాయలను తినడం అలవాటు చేసుకోవాలి. నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.


అల్లం 
దీనిలో మెగ్నీషియం, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అల్లాన్ని అధికంగా తీసుకుంటే కండరాలు రిలాక్స్ అవుతాయి. అల్లం తినడం వల్ల అలసట, గురక దూరంగా ఉంటాయి. గురక నుండి బయట పడాలనుకుంటే నిద్రపోయే ముందు అల్లం టీ ని తాగండి.


ఆపిల్ 
ఆపిల్ పండులో పోషకాలు పుష్కలం. రోజుకో ఆపిల్ పండు తింటే చాలు. ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. అలాగే గురకకు దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆపిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది గురకను రాకుండా అడ్డుకుంటుంది. ఆపిల్ లో ఉండే పోషకాలు రక్తనాళాలు మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. కాబట్టి గురక సమస్య కూడా తగ్గుతుంది.


Also read: టాటూ వేయించుకోవాలనుకుంటున్నారా? ఈ భాగాల్లో మాత్రం వద్దు








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.